31-10-2025 01:21:18 AM
 
							క్రాంతి మల్లాడి :
వరదలతో వరంగల్ వణికినా..
మున్నేరులో ఖమ్మం మునిగినా షరామామూలే!
* ప్రకృతి ప్రకోపం ఒకవైపు.. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం మరొక వైపు.. ప్రజలకు మిగిలేది పుట్టెడు దుఃఖమే. ఊహించని విలయాలను ఎదుర్కొనేందుకు వ్యవస్థలు సిద్ధంగా లేకపోవడంతో దారుణ పరిస్థితులను చవిచూడాల్సి వస్తున్నది. విపత్తుపై అప్రమత్తం కావడంలో పాలన వ్యవస్థ పూర్తిగా విఫలమవుతున్నది. అకాల వర్షాలతో ఇక మాకు దేవుడే దిక్కు అన్నట్లుగా రాష్ట్ర రైతాంగం కుదేలవగా.. ఊహించని భారీ వర్షాలతో వరంగల్, హనుమకొండ, ఖమ్మం పట్టణ ప్రజలకు ఎదురైన ఇబ్బందులు వర్ణణాతీతం.
వరంగల్ నగరం ఒకప్పుడు ‘చెరువుల నగరం’గా పేరుగాంచింది. కాకతీయుల కాలంలో రూపొందిన చెరువులు, వాగులు వర్షపు నీటిని సేకరించి, నగరాన్ని వరదల నుండి కాపాడేవి. కానీ నేడు వరంగల్‌లో ఆ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు వానపడితే చాలు ఖమ్మం నగరాన్ని మున్నేరు నది భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఏటా వందలాది కోట్లు వెచ్చించి పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ పనులు చేపట్టినా.. ఈ పట్టణాల పరిస్థితి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది.
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాం తి): మొంథా తుఫాన్ తెచ్చిన భారీ వర్షాల తో అన్ని జిల్లాల్లోనూ ప్రజలు, రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వరంగల్, హనుమకొండ, ఖమ్మం నగరాలు అతలాకు తలమయ్యాయి. వరంగల్ నగరంలో భద్రకా ళి చెరువు, పెద్దవాగులు, ఖమ్మంలో మున్నేరు నది పొంగిపొర్లడంతో చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరి, వేలాది కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. వరంగల్‌లో హంటర్ రోడ్, మాటే పల్లి, ఫతేనగర్, సుభాష్‌నగర్ కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరుచేరడంతో ప్రజలు భవనాల పై అంతస్తుల్లో ఆశ్రయం పొందారు.
పలు రహదారులు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరాఫరా అంతరాయం, తాగునీటి సమస్యలు తలెత్తాయి. మరోవైపు ఖమ్మం నగరంలో మున్నేరు నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నది. మున్నేరు, కాళ్లేరు, మునిగేరు వాగులు పొంగి పొర్లడంతో పట్టణం మొత్తం నీటిలో మునిగిపోయింది. లోతట్టు కాలనీలు, వైఎండీ కాలనీ, పెద్దమ్మగుడి ప్రాంతాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. వందల కుటుంబాలను తాత్కాలిక శిబిరాలకు తరలించారు.
నగరంలో రోడ్లు, కాలువలు దెబ్బతినడంతో పునరుద్ధరణ పనులు కష్టతరంగా మారాయి. మొత్తంగా దాదాపు 2 వేలకుపైగా ఇళ్లు దెబ్బతిన్నట్టు అంచనాలు వేస్తున్నారు. సుమారు 25 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో వ్యాపారులు, చిన్న కూలీలకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. వరంగల్, హనుమకొండ, ఖమ్మం నగరాల్లో ప్రస్తుత ప్రమాదకర పరిస్థితులకు.. పట్టణ ప్రణాళికా వైఫల్యం, చెరువుల ఆక్రమణ, డ్రైనేజీ బలహీనత, పర్యావరణ నాశనం వంటి అంశాలే కారణమ య్యాయి. ఇది సహజ విపత్తు కాదని బాధిత ప్రజలు వాపోతున్నారు.
చెరువులు, వాగుల మార్గాల ఆక్రమణ
ఖమ్మం పట్టణంలో ఉన్న చిన్న చెరువులు, వాగులు ఇప్పుడు గృహ నిర్మాణాల కింద మాయమయ్యాయి. మున్నేరు వైపు వెళ్ళే నీటి సహజ మార్గాలు మూసుకుపోవడంతో, వర్షం పడితే నీరు నగరంలోనే నిలిచిపోతోం ది. ఖమ్మం పట్టణంలో ఒకప్పుడు 50కి పైగా చిన్న చెరువులు ఉండేవి. ఇవే వర్షపు నీటిని నిల్వచేసి మున్నేరు వైపు క్రమంగా వదిలేవి. కానీ ఇప్పుడు వాటిలో ఎక్కువ భాగం గృహ నిర్మాణాలు, పార్కులు, రోడ్లు, లేఅవుట్లుగా మారిపోయాయి.
ముఖ్యంగా బైపాస్ రోడ్ చెరువు స్థలంలో వాణిజ్య కాంప్లెక్సులు, మోట్‌నగర్ ప్రాంతంలో చెరువు పూర్తిగా పూడ్చివేత, మున్నేరు వైపు వెళ్ళే వాగులు రోడ్ల క్రింద మూసివేతకు గురికావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చెరువుల చుట్టూ బఫర్ జోన్‌లు గుర్తించి రక్షించాల్సిన బాధ్యత మున్సిపల్ సంస్థలదే. కానీ గత 15 ఏళ్లలో ఈ నియమాలు కేవలం పత్రాలకే పరిమితమయ్యాయి. స్థానిక రాజకీయ ఒత్తిళ్లతో అనేక ఆక్రమణలకు మద్దతు లభించింది. కొన్ని చెరువు స్థలాలు ‘హౌసింగ్ ప్రాజెక్ట్’ పేరుతో క్రమబద్ధీకరణకు గురయ్యాయి.
ప్రణాళికలో లోపాలు..
ఖమ్మం నగరానికి సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ సరిగా అమలు కాలేదని అధికార వర్గా లూ అంగీకరిస్తున్నాయి. మాస్టర్‌ప్లాన్‌లో మున్నేరు నది బఫర్ జోన్ 200 మీటర్ల వర కు ఉంచాలని సూచించారు. కానీ రియల్ ఎస్టేట్ ఒత్తిడి వల్ల ఆ నియమాలు ఉల్లంఘనకు గురవుతున్నాయని మున్సిపల్ అధికారవర్గం తెలుపుతున్నది. ఫలితంగా వర్షపు నీటి ప్రవాహం నేరుగా నగరంలోకి దూసుకువచ్చే పరిస్థితి ఏర్పడింది.
మారుతున్న పర్యావరణ పరిస్థితులు..
మున్నేరు పరిసరాల్లో ఉన్న అడవులు, పచ్చదనం గణనీయంగా తగ్గిపోయాయి. ఖమ్మం ప్రాంతంలో మున్నేరు నది ముంపు ప్రతి ఏటా మరింత తీవ్రంగా మారడానికి ఒక మూలకారణం. గత దశాబ్ద కాలంలో సహజ వనరుల నాశనం, చెరువుల నింపివేత, అడవుల నరికి వేయడం వంటి అంశాలు వాతావ రణం మరియు నీటి ప్రవాహ వ్యవస్థపై భారీ ప్రభావం చూపాయి. ఖమ్మం పరిసర అటవీ ప్రాంతాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీని వలన నేల నీటిని ఆబ్సార్బ్ చేసుకునే సామర్థ్యం కోల్పోయింది.
గత పదిహేనేళ్లలో ఖమ్మం చుట్టుపక్కల వ్యవసాయ భూములను పట్టణ విస్తరణకు ఉపయోగించడం, పరిశ్రమలు, రోడ్లు నిర్మించడం వలన నేల సహజ శోషణ వ్యవస్థ దెబ్బతిన్నది. గ్రీన్ కవరేజీ తగ్గిపోవడంతో, వర్షపు నీటి పరిమాణం నేరుగా మున్నేరు ప్రవాహంలోకి చేరిపోతోంది. పర్యావరణ సమతుల్యత కోల్పోవ డంతో మున్నేరు లాంటి నదులను ఒక్కసారిగా ఉద్ధృతం చేసి నగరాలను ముంచే పరిస్థితి తీసుకువస్తుంది.
మున్నేరు నది ప్రవాహంపై రియల్‌టైమ్ మానిటరింగ్ లేకపోవడం అత్యంత కీలక లోపమని నిపుణులు పేర్కొంటున్నారు. నదిపై ఉన్న గేజ్ రీడింగ్ పాయింట్లు చాలావరకు పాత పద్ధతిలోనే పనిచేస్తున్నాయి. ఆటోమేటెడ్ రైన్ గేజ్‌లు, ప్రవాహ సెన్సర్లు ఉన్నా, డేటా సమన్వయం వ్యవస్థ సరిగా లేనందున సంబంధిత విభాగాలకు సమాచారం ఆలస్యంగా చేరుతోంది.
ముంపు హెచ్చరికల సమయంలో వాతావరణ శాఖ, రేవెన్యూ, మున్సిపల్, పోలీస్, విపత్తు నిర్వహణ శాఖల మధ్య సమన్వయం సరిగా లేకపోవడం ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొన్నారు. ఒక శాఖ సమాచారం ఇచ్చినా, మరొక శాఖ స్పందించేలోపే వరద నీరు పట్టణంలోకి చేరిపోతుందని అంటున్నారు. గ్రామస్థాయిలో అలర్ట్ పంపే సైరన్ సిస్టమ్స్, మొబైల్ అలర్ట్‌లు చాలా చోట్ల పనిచేయడం లేదు.
హెచ్చరిక వ్యవస్థ ఉన్న చోట కూడా ప్రజల్లో అవగాహన లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. తక్షణ తరలింపు ప్రణాళిక సక్రమంగా ప్రచారం చేయకపోవడంతో తక్కువ సమయంలో భారీ నష్టం జరుగుతోంది. ఖమ్మం లాంటి వరదాపాయ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ మానిటరింగ్ సిస్టమ్, రియల్‌టైమ్ అలర్ట్ యాప్‌లు, సైరన్ నెట్‌వర్క్‌లు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అధికారుల అలసత్వం..
వర్షాల అంచనాలు వచ్చినప్పటికీ అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. ‘వరంగల్ ముంపు సహజ కారణాల కంటే మానవ నిర్మిత కారణాలే ఎక్కువ’ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రణాళికా లోపాలు, ఆక్రమణలు, డ్రైనేజ్ వైఫల్యాలు కలసి ఈ నగరాన్ని ప్రతి వర్షాకాలం భయపెట్టే పరిస్థితికి నెట్టాయి. ముంపు హెచ్చరికలు వస్తున్నా చర్యలు తీసుకోవడంలో అధికారలు అలసత్వంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిసారీ వర్ష సూచనలతోనే పరిస్థితి తీవ్రంగా మారుతుందని తెలిసినా, వరంగల్ మునిసిపల్ సంస్థ, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల స్పందన అత్యంత ఆలస్యంగా వస్తోంది.
దీని వల్ల ముంపు సమ యంలో ప్రజల ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎక్కువవుతోంది. వరంగల్‌లో డీఆర్‌ఎఫ్ టీమ్ సిబ్బంది చాలా తక్కువ స్థాయిలో ఉంది. ముంపు వచ్చిన తర్వాతే బృందా లు సమన్వయం చేసుకోవడం ప్రారంభిస్తాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న కాలనీల కు సమయానికి హెచ్చరిక రాకపోవడం వల్ల ప్రజలు ఇళ్ళను విడిచివెళ్లే అవకాశం కోల్పోతున్నారు. విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్లు ఆలస్యం అవుతున్నాయి. చెరువుల కట్టలు బలహీనపడుతున్నా, ఇంజనీరింగ్ విభా గం తక్షణం చర్యలు తీసుకోవడం లేదు.
నియంత్రణ లేని నగర విస్తరణ..
వరంగల్ నగరం గత దశాబ్దంలో వేగంగా విస్తరించింది. నివాస, వాణిజ్య భవనాలు చాలా వరకు చెరువులు, వాగుల పరిధిలోనే నిర్మాణమయ్యాయి. భద్రకాళి చెరువు, పాదాల చెరువు, కాజీపేట్ చెరువు చుట్టూ ఉన్న నీటి ప్రవాహ మార్గాలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. వర్షపు నీరు చెరువులకు బదులు రోడ్లపైకి వస్తోంది. జీహెచ్‌ఎంసీ తరహాలో ప్రణాళిక లేకుండా, ప్రైవేట్ లేఅవుట్లు అనుమతులు లేకుండా విస్తరించాయి.
అధికారులు మౌనంగా ఉండడంతో ఇళ్ల నిర్మాణాలు వరద ముంపు ప్రాంతాల వరకూ చొచ్చుకుపోయాయి. వరంగలో 1990లో జనాభా సుమారు 3 లక్షలు, ఇప్పుడు 10 లక్షలకు పెరిగింది. కానీ లైన్లు, పైపులు, పంపులు 30 ఏళ్ల క్రితం పరిమాణంలోనే ఉన్నాయి. వర్షపు నీరు వెళ్లే కాల్వల్లో ప్లాస్టిక్, నిర్మాణ వ్యర్థాలు, చెత్త కుప్పలతో నీటి ప్రవాహం ఆగిపోతుంది. దీని వల్ల నీరు నిల్వ అయి ముంపుగా మారుతోంది. దీనికితోడు కొత్తగా ఏర్పడుతున్న లేఅవుట్లలో డ్రైనేజ్ లైన్‌ను ప్రధాన నెట్‌వర్క్‌తో కలపకపోవడంతో వర్షపు నీరు మూసుకుపోయి రోడ్లపైకి వస్తుంది.
పరిష్కార మార్గాలు..
* చెరువులు, వాగుల చుట్టూ ఫ్లడ్ బఫర్ జోన్‌లను స్పష్టంగా గుర్తించడం
* కొత్త కాలనీలకు అనుమతులు ఇచ్చే ముందు డ్రైనేజ్ మ్యాప్ తప్పనిసరిగా ఉండాలి
* అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువుల పునరుద్ధరణ
* రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రీన్ కవర్ పెంపు
* వర్షపు నీటికి ప్రత్యేక స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలి
* పాత డ్రైనేజ్ లైన్లను పెద్ద వ్యాసపు పైపులతో రీడిజైన్ చేయాలి
* ప్రతి వర్షాకాలానికి ముందు డ్రైనేజ్ క్లీనింగ్ డ్రైవ్ తప్పనిసరిగా జరగాలి
* కాల్వల్లో చెత్త వేస్తే ఫైన్ విధించే చట్టం అమలుచేయాలి. వర్షపు నీటి రీచార్జ్ పిట్‌లు తప్పనిసరి చేయాలి
చెరువులు, వాగుల నిర్వహణలో నిర్లక్ష్యం..
చెరువుల కట్టలు సకాలంలో మరమ్మతు చేయకపోవడం వల్ల అధిక వర్షాల సమయంలో కట్టలు తెగిపోతున్నాయి. వాగులలో మట్టిపూడిక, చెత్త తొలగింపు పనులు నిర్లక్ష్యం చేయడం వల్ల నీటి ప్రవాహం ఆగిపోతుంది. ప్రవాహ మార్గాలపై అక్రమ నిర్మాణాలు ముంపును మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ప్రస్తుతం చెరువుల ఫీడర్ చానెల్స్ (నీటి ప్రవాహ మార్గాలు) మట్టిపూడిక, చెత్తతో నిండిపోయాయి. కట్టలు బలహీనపడి, చెరువుల లోతు తగ్గిపోయింది. వాగులు చెత్త, మురుగు కాలువలుగా మారాయి.
దీంతో నగరానికి గుండెకాయలాంటి భద్రకాళి చెరువు చుట్టూ మురుగు లైన్లు కలిసిపోవడంతో నీరు బాగా కలుషితమవుతోంది. కాజీపేట్ చెరువు ఒకప్పుడు వరదనీటిని సమర్థవంతంగా నిల్వ చేసేది. ఇప్పుడు చెత్త, గడ్డి, మట్టితో నిండిపోయి లోతు తగ్గింది. చెరువుల డీ-సిల్టింగ్ (మట్టిపూడిక తొలగింపు) పనులు సంవత్సరాలుగా చేయలేదు. మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు ప్రారంభమైనా స్థిరమైన ఫలితాలు రాలేదు. చెరువుల చుట్టూ ప్రవాహ మార్గాల గుర్తించకపోవడం వల్ల ఆక్రమణలు ఆగడం లేదు. పర్యవేక్షణ లేకపోవడం పునరుద్ధరణ చర్యలు నిలిచిపోయాయి.
పరిష్కార మార్గాలు..
* ప్రతి చెరువు చుట్టూ కనీసం 30 మీటర్ల బఫర్ జోన్ తప్పనిసరిగా ప్రకటించాలి
* చెరువులు, వాగులలో డీ-సిల్టింగ్ - చెత్త తొలగింపు పనులు ప్రతి ఏటా మాన్సూన్ ముందు పూర్తి చేయాలి
* వాటర్ బాడీ మేనేజ్‌మెంట్ కమిటీలు స్థానిక ప్రజలతో ఏర్పాటు చేయాలి
* డోన్ సర్వేలు ద్వారా ఆక్రమణలు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి
* చెరువు నీరు మురుగుతో కలవకుండా ప్రత్యేక డ్రైనేజ్ లైన్‌లు ఏర్పరచాలి
నగర ప్రణాళిక లోపాలు..
పట్టణ అభివృద్ధి ప్రణాళికలో డ్రైనేజ్ జోన్లు, ఫ్లడ్ చానెల్స్ గుర్తింపు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నగరంలో నీరు నిలిచే ప్రాంతాలను ‘హై రిస్క్ జోన్’గా గుర్తించకుండా నిర్మాణ అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ప్రస్తుత వర్షపాతం తీవ్రతకు సరిపోవడం లేదు. కొత్త రోడ్లు పాత కాలనీల కంటే ఎత్తుగా నిర్మించడంతో వర్షపు నీరు తక్కువ ప్రాంతాలకు వెనక్కి మళ్లి ముంపు సృష్టిస్తోంది.
పార్కులు, గ్రీన్‌బెల్ట్‌లు లేకపోవడం వలన నీరు శోషించుకునే నేచురల్ సిస్టమ్ దెబ్బతింటుంది. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సరిగా సమన్వయం లేకుండా అనుమతులు ఇస్తోం ది. జీఐఎస్ ఆధారిత మాస్టర్‌ప్లాన్ లేకపోవడం వల్ల వాస్తవ సమీక్ష జరగడం లేదు. సివిక్ బడ్జెట్‌లో డ్రైనేజ్, ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌కి తక్కువ నిధులు కేటాయిస్తున్నారు. వరంగల్‌లో క్రమంగా పచ్చదనం తగ్గిపోతుంది. గత 20 ఏళ్లలో వరంగల్ నగర పరిధిలో గ్రీన్ కవరేజ్ 42 శాతం నుండి 18 శాతానికి పడిపోయింది.
పార్కులు, చెట్లు కూల్చి భవనాలు, మాళ్లు ఏర్పడ్డాయి. చెరువులలోని జలచర జీవాలు, నీటి మట్టం, బయోడైవర్సిటీ తగ్గిపోవడంతో సహజ నీటి నిల్వ సామర్థ్యం బలహీనమైంది. నగర ఉష్ణోగ్రత సగటుగా 2 పెరిగింది. నేల నీటిమట్టం ప్రతి సంవత్సరం 0.8 మీటర్ల చొప్పున తగ్గుతోంది. వర్షపాతం అసమానంగా కురుస్తోంది. జీవవైవిధ్యం క్షీణించడం వలన సహజ నీటి ఫిల్టరేషన్ వ్యవస్థలు నశించాయి.
పరిష్కార మార్గాలు..
* వరంగల్‌కు కొత్త ‘క్లుమైట్ -స్మార్ట్ అర్బన్ ప్లాన్’ సిద్ధం చేయాలి
* డ్రైనేజ్, వాగులు, చెరువులను ఒకే ‘హైడ్రోలాజికల్ మ్యాప్’లో పునర్వ్యవస్థీకరించాలి
* కొత్త నిర్మాణాలకు ముందు ఫ్లడ్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ తప్పనిసరి చేయాలి
* ఇంటిగ్రేటెడ్ వరంగల్ సిటీ మేనేజ్‌మెంట్ సెల్ ఏర్పాటు చేసి, స్మార్ట్ సెన్సర్ ఆధారిత ఫ్లడ్ మానిటరింగ్ అమలు చేయాలి
* ప్రతి కొత్త కాలనీలో 30% గ్రీన్ స్పేస్ తప్పనిసరిగా ఉండాలి
* చెరువులు, వాగులు చుట్టూ నేచురల్ బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి
* అర్బన్ ఫారెస్టేషన్ ప్రాజెక్టులు అమలు చేయాలి
* పర్యావరణ అథారిటీ ద్వారా ఇకో ఇంపాక్ట్ అసెస్‌మెంట్ తప్పనిసరి చేయాలి
* పౌరులు, విద్యార్థులు, సంస్థలు కలిసి చెరువు సంరక్షణ ఉద్యమాలు ప్రారంభించాలి
ముంచుతున్న మున్నేరు..
మున్నేరు నది ఒకప్పుడు విస్తారమైన సహజ ప్రవాహమార్గంతో, ఖమ్మం నగరానికి జీవనాధారంగా ఉండేది. కానీ గత రెం డు దశాబ్దాల్లో తీర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు పెరగడంతో నదికి ఇరువైపులు చొచ్చుకొచ్చాయి. వర్షపు నీటి ప్రవాహం సరిగ్గా వెళ్లలేకపోవడం వల్ల, నగరంలోని తక్కువ ఎత్తు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. మున్నేరు తీరప్రాంతాలు అనేక చోట్ల గృహ నిర్మాణాలు, వాణిజ్య కాంప్లెక్సులు, గోడలతో ఆక్రమణకు గురయ్యాయి.
నది పక్కన ఉండే బఫర్ జోన్‌ను పూర్తిగా లేకుండా చేశాయి. ఖమ్మం నగర రక్షణ కోసం నదికి తీర గోడలు కట్టినా, అవి సాంకేతికంగా సరైన కోణంలో లేవు. కొన్ని ప్రాంతాల్లో గోడలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటూ తిరిగి నగరం వైపు మళ్లిస్తున్నాయి. అదే కారణంగా తక్కువ ఎత్తులో ఉన్న కాలనీలు ముందుగా మునిగిపోతున్నాయి. మోతే నగర్, మున్సిపల్ ఆఫీస్ రోడ్, వాయరగడ్డ ప్రాంతాలు నది ఒడ్డున ఉన్నా రక్షణ గోడలు తగిన ఎత్తులో లేవు.
మున్నేరు నది అడుగు భాగం మట్టిపూడికతో నిండిపోయి, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ప్రతి సంవత్సరం మాన్సూ న్ తర్వాత డీసిల్టింగ్ చేయకపోవడం వల్ల ప్రవాహ వేగం తగ్గి, నీరు వెనక్కి తగులుతోంది. మున్నేరు నది గతంలో చిన్న వాగు లు, చెరువుల ద్వారా నీటిని తీసుకునేది. ఇప్పుడు అవి రోడ్లుగా, భవనాలుగా మారిపోయాయి.
దీంతో నదికి సహజ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వ్యవస్థ దెబ్బతింది. దీనికితోడు మున్నేరులో ఇసుక తవ్వకాలు అధికమవడంతో నది ప్రవాహ దిశలు మారాయి. కొన్ని చోట్ల తవ్వకాల వల్ల లోతు పెరిగి, మరికొన్ని చోట్ల పూడిక పెరగడంతో నీటి స్తబ్దత ఏర్పడుతోంది. ఇది నది సహజ ప్రవాహాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది.
పరిష్కార మార్గాలు..
* మున్నేరు ప్రవాహ మార్గాన్ని జీఐఎస్ సర్వే ద్వారా ఖచ్చితంగా గుర్తించి, ఆక్రమణలను తొలగించాలి
* ప్రతి సంవత్సరం డీసిల్టింగ్ ఆపరేషన్ నిర్వహించాలి
* నది ఒడ్డున సహజ బఫర్‌జోన్ (30- 50 మీటర్ల వరకు)కట్టడి చేయాలి
* చెరువులు, వాగులు మళ్లీ నదితో అనుసంధానించే ప్రాజెక్ట్ రూపొందించాలి
* సాండ్ మైనింగ్‌పై కఠిన నియంత్రణలు అమలు చేయాలి