02-05-2025 07:39:45 PM
మహాదేవపూర్,(విజయక్రాంతి): అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఎర్ర చెరువు లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొట్టుకొని పోవడం జరిగింది. శుక్రవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు బోరుణ విలపించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కొరకు ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రారంభించి మిల్లులకు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ కొనుగోలు ప్రక్రియలో తాలూ, తరుగు, తడిసిన ధాన్యం, పేరుతో రైతులను ఇబ్బంది చేయద్దని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్ర ఇంచార్జ్ లే పూర్తి బాధ్యత వహించాలని ధాన్యం కొనుగోలు ట్యాబ్ ఎంట్రీలను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో తార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మాయంకా సింగ్, డీఎస్ఓ శ్రీనాథ్, మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు, మైనార్టీ సెల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అశ్రర్ ఖురేషి, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ రైతులు పాల్గొన్నారు.