calender_icon.png 5 September, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మనుబోతుల కొమురయ్య వర్ధంతి వేడుకలు

05-09-2025 02:55:01 PM

మందమర్రి (విజయక్రాంతి): దివంగత సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి మనుబోతుల కొమురయ్య 29వ వర్ధంతి వేడుకలు ఏరియాలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏరియాలోని కేకే 5 కేకే ఓసిపి ఏరియా వర్క్ షాప్ లతో పాటు గనులు డిపార్ట్మెంట్లలో శుక్రవారం మనుబోతుల కొమురయ్య వర్ధంతి వేడుకలను కార్మికుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయుసీ నాయకులు సలేంద్ర సత్యనారాయణ, భీమనాధుని సుదర్శన్ లు కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో బొగ్గు గని కార్మిక కుటుంబంలో 1928 జూన్ 12న జన్మించిన కొమరయ్య ఇల్లందులో ప్రాథమిక విద్యను అభ్యసించి స్కూల్ ఫైనల్ చదివే రోజుల్లో కార్మికోద్యమాలకు ఆకర్షితుడై చదువుకు స్వప్తి చెప్పి దేవూరి శేషగిరిరావు స్ఫూర్తితో కార్మిక పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారనీ వారు అన్నారు. 

1940లో కొత్తగూడెం మెయిన్ వర్క్ షాప్ లో టర్నర్ గా సింగరేణి ఉద్యోగంలో చేరి కార్మిక వర్గ పోరాటాలను నిర్మించి ముందుకు సాగారు. ఎన్నో అవరోధాలు నిర్బంధాలు ఎదురైనప్పటికీ మడమ తిప్పకుండా కార్మిక వర్గ ప్రయోజనాలపై సమరం చేస్తూ, సింగరేణిలో కార్మిక సంఘం నిర్మించి కార్మికులoదరిని ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే సంకల్పంతో 1942 మే 1న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ స్థాపించి కార్మిక వర్గ శ్రేయస్సుకు నిరంతరం కృషి చేశారన్నారు. వేజ్ బోర్డు శాశ్వత సభ్యునిగా కోల్ ఇండియాలో లేని అనేక హక్కులను సింగరేణి కార్మికులకు సాధించి పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సింగరేణి కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్, పెన్షన్ స్కీంతో పాటు సింగరేణినీ బిఐఎఫ్ఆర్ పరిధి నుండి కాపాడడంతో పాటు కార్మికుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి కార్మికుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని, సింగరేణి ఉన్నన్ని రోజులు  కొమురయ్య పేరు సంస్థలో చిర స్థాయిగా కార్మికుల మదిలో నిలిచిపోతుందని ఆయన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఏరియా నాయకులు కంది శ్రీనివాస్, సోమిశెట్టి రాజేశం, పెద్ద పెళ్లి బానయ్య, రాజేశ్వరరావు, ముల్కలపెళ్లి వెంకటేశ్వర్లు, గోపతి సత్యనారాయణ, సివి రమణ, సాధనవేణి ప్రభాకర్, పిట్ కార్యదర్శిలు మర్రి కుమారస్వామి, ప్రేమ్ లాల్, పారిపెళ్లి రాజేశం,కలవల శ్రీనివాస్, ఓదెలు, నాయకులు కన్నం వేణు, రాజేశ్ కుమార్ యాదవ్, కొండయ్య, కాసం సమ్మయ్య, పొన్నం శ్రీనివాస్, రాజేందర్, సదానందం, లక్ష్మణ్, విక్రమ్ సింగ్, హేమ చందు, కోటయ్య, మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.