calender_icon.png 5 September, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగమ్మ ఒడికి.. గణపయ్యలు..!

05-09-2025 03:26:14 PM

లంబోదరుడికి ఘనంగా వీడ్కోలు

జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా శోభాయాత్రలు

ఒకటో నంబర్‌ విగ్రహం వద్ద మంత్రి కోమటిరెడ్డి పూజలు

అడుగడుగనా పోలీస్‌ నిఘా..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఎటుచూసినా చూసినా ఉత్సవ శోభ.. ఎక్కడ విన్నా గణపతి నామస్మరణ.. కోలాటాలు.. డీజే పాటలు.. బ్యాండ్‌ చప్పుళ్లు.. తీన్మార్‌ స్టెప్పుల నడుమ లంబోధరుడిని నిమజ్జన శోభాయాత్రలు అట్టహసంగా సాగాయి. నవరాత్రులు ఘనంగా పూజలు అందుకున్న గణనాధులను శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించి వాహనాలపై భక్తిశ్రద్ధలతో తరలించి గంగమ్మ ఒడికి చేర్చారు. పట్టణాల్లో శోభాయాత్ర సంబురం అంబరాన్నంటింది. గల్లీగల్లీ జై గణేశ్‌ మహారాజ్‌కీజై నినాదాలతో హోరెత్తాయి. నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ హనుమాన్‌నగర్‌లో ఏర్పాటుచేసిన ఒకటో నెంబర్‌ గణపయ్య విగ్రహం వద్ద రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. మంత్రితోపాటు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి పూజల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో శోభాయాత్రలు ఉదయం ప్రారంభం కాగా, సాయంత్రానికి ఒక్కోక్క విగ్రహం క్లాక్‌టవర్‌ సెంటర్‌కు చేరువడంతో అక్కడంతా ఉత్సవ వాతావరణం నెలకొంది. గణనాథులను చూసేందుకు తరలివచ్చిన భక్తులతో పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. శోభయాత్ర సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.