05-09-2025 02:54:54 PM
నేనూ సర్కార్ స్కూల్ లో చదువుకునే సీఎం అయిన.
తెలంగాణకు నూతన విద్యావిధానం కావాలి.
టీచర్లు బాగా పనిచేస్తే.. రెండోసారి సీఎం అవుతా.
నేనూ రెండోసారి సీఎం అవ్వాలనుకుంటున్నా.
హైదరాబాద్: విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అన్నారు. మాదాపూర్ శిల్పకళావేదికలో గురుపూజోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుపూజోత్సవ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నానని సీఎం వివరించారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. చాలా చోట్ల కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందడం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రతిగ్రామానికి జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులే అన్నారు.
ఆనాడు జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించేలా చేశారని చెప్పారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు తమ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకున్నారు?అని ముఖ్యమంత్రి పశ్నించారు. విద్యార్థులకు గత ప్రభుత్వం సరైన ఆహారం అందించలేదని ఆయన ఆరోపించారు. విద్యారంగంను గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని ధ్వజమెత్తారు. కొత్త నియామకాలను గత ప్రభుత్వం నియామించలేదని విమర్శించారు. గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా వర్సిటీ మూతపడే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నేనూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చానని వివరించారు. గతంలో గురుపూజోత్సవం ఎప్పుడైనా జరిగిందా.. అందులో సీఎం పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్ల సహకారం కావాలన్నారు. పిల్లలు ఎక్కువ సమయం టీచర్ల వద్దే ఉంటారు..పిల్లలతో కలిసే టీచర్లు మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. గత ప్రభుత్వం వర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించడానికి తీరిక లేదన్న ఆయన వీసీల నియామకంలోనూ గత ప్రభుత్వం రాజకీయాలు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం, టీచర్ల చొరవతో కొత్తగా 3 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ప్రైవేట్ స్కూళ్ల టీచర్ల కంటే.. ప్రభుత్వ టీచర్లకు నైపుణ్యం అధికం అన్నారు. వివాదాస్పదమైన విద్యాశాఖ తీసుకోవద్దని నాకు కొందరు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తున్నామని వెల్లడించారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకంటే నాణ్యమైన విద్య అందిస్తామని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు.
ఏటా 200 మంది టీచర్లను విదేశాలకు పంపి.. అక్కడి విద్యావిధానం అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ఢిల్లలో కేజ్రీవాల్ రెండోసారి సీఎం కావడానికి ఆయన చేసిన విద్యాభివృద్ధే కారణం అన్నారు. కాకూ స్వార్థం ఉంది.. టీచర్లు బాగా పనిచేస్తే.. నేనూ రెండోసారి సీఎం అవ్వాలనుకుంటున్నాని చెప్పారు. టీచర్లే కష్టపడండి.. నేను సీఎం అవుతా అనట్లేదు.. మీతో పాటే నేనూ కష్టపడుతానని సూచించారు. నేను ఫామ్ హౌస్ లో పడుకుంటూ.. మళ్లీ సీఎంను చేయండి అనట్లేదన్న రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధి కోసం టీచర్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని తేల్చిచెప్పారు. ఐటీఐలు అప్ గ్రేడ్ చేసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా మార్చామన్నారు. ఏటీసీలో టాటా కంపెనీ కల్పించిన సదుపాయాలు చూస్తే నాకే మతిపోతుందని చెప్పారు. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్.. ఒలింపిల్స్ లో ఒక్క స్వర్ణం సాధించలేదని తెలిపారు. దక్షిణ కొరియాలో ఒక్క యూనివర్సిటీనే 16 స్వర్ణ పతకాలు సాధించిందన్నారు. మట్టిలో మాణిక్యాలను వెతికితీయండి.. వారికే ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తామని, క్రీడాల్లో రాణించిన క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీ అయ్యారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.