22 June, 2026 | 3:03 AM

రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం

22-06-2026 12:32 AM

వనపర్తి, జూన్ 21 (విజయక్రాంతి): రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా నియమితులైన బోయ నగేష్ ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అప్పాయిపల్లి డబుల్ బెడ్ రూమ్ వద్ద తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా స్థానిక సంఘం సభ్యులు, నాయకులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సంఘం సభ్యులు, కాలనీ వాసులు మాట్లాడుతూ వాల్మీకి బోయ సామాజిక వర్గ అభివృద్ధికి, వారి సంక్షేమానికి రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా బోయ నగేష్ తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంతటి కీలక బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన పదవి వ్యక్తిగత గౌరవం కాదని, వాల్మీకి బోయ సమాజ అభివృద్ధి కోసం పనిచేసే ఒక బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. వాల్మీకి బోయలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి రంగాల్లో బోయ యువత ముందుకు రావడానికి అవసరమైన అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. వాల్మీకి బోయ సమాజం ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనతో పాటు అభివృద్ధి వైపు పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ బాలరాజు, వాల్మీకి బోయ సంఘ నాయకులు రాజు, రాము, రమేష్, రవి, రాజు తదితరులు, కాలనీ వాసులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.