6 August, 2026 | 10:53 PM

సిమెంట్ రోడ్లకు గ్రీన్ సిగ్నల్.. నెల రోజుల్లో నిధుల మంజూరు

06-08-2026 09:31 PM

ఉప్పల్,(విజయక్రాంతి): హెచ్‌ఎంటి నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో మిగిలి ఉన్న సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టాలని కోరుతూ నూతనంగా ఏర్పాటైన ఇందిరానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాలనీలోని కుడివైపున ఉన్న 16 వీధుల్లో ఇప్పటికే సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తికావడంతో పాటు డ్రైనేజీ సమస్యలు కూడా పరిష్కారమయ్యాయని అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎడమవైపున ఉన్న వీధి నంబర్లు 2, 3, 4, 5, 7తో పాటు ఇందిరానగర్ ప్రధాన రోడ్డును భాను ఆంటీ ఇంటి వరకు సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని కోరారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించి, మిగిలిన రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను నెల రోజులలోపు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.అనంతరం కొత్తగా ఎన్నికైన ఇందిరానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అలీమ్ భాయ్, చంద్రశేఖర్, మోయిన్ అలీముద్దీన్, అబ్దుల్ జబ్బర్ భాయ్, అవేస్, అమీర్, సాజిద్ ఖాన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్‌తో పాటు కాలనీ ప్రముఖులు పాల్గొన్నారు.