calender_icon.png 23 September, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగంగా భూ సేకరణ

23-09-2025 01:01:38 AM

-నేషనల్ హైవేల నిర్మాణానికి అడ్డంకులు ఉండొద్దు 

-నిర్వాసితులకు తక్షణం పరిహారం అందించాలి 

- పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి 

-వన్యప్రాణుల్లేని చోట ఆ చట్టాలు అమలు చేయడం సరికాదు 

- అవసరమైతే నేను స్వయంగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతా 

-అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములిస్తాం 

- అనుమతులు సాధించుకుంటాం: సీఎం రేవంత్‌రెడ్డి 

-ఎన్‌హెచ్‌ఏఐ, ఫారెస్ట్, ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో సమీక్ష

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూసేకరణ అంశాన్ని మానవీయ దృక్పథంతో చూడాలని, రహదారుల నిర్మాణంతో ఒనగూరే ప్రయోజనాలను రైతులకు వివరించి ఒప్పించాలని సూచించారు.

ఆర్బిట్రేషన్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), జాతీయ రహదారుల విభాగం (ఎన్‌హెచ్), జాతీయ రహదారులు, రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్), రహదారులు, భవనాల శాఖ, అటవీశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు.

చిన్న చిన్న కారణాలతో పలు రహదారుల పనుల్లో జాప్యం వాటిల్లుతుండడం సరికాదని, వెంటనే ఆయా సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. నిర్వాసితులకు తక్షణం పరిహారం అందేలా చూడాలని ఆదేశించారు. ఉత్తర ప్రాంతంలో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్‌ఆర్) నిర్మాణంపై కేంద్రం లేవనెత్తిన ప్రతి సందేహాన్ని రాష్ట్రప్రభుత్వం నివృత్తి చేస్తున్నదని, అయినప్పటికీ కొత్త సమస్యలు తెరమీదకు రావడంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇకపై సందేహాలన్నింటినీ ఒకేసారి రాష్ట్రప్రభుత్వానికి పంపించాలని సీఎం కోరగా, అందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రస్తుతం ఎలాంటి సందేహాలు లేవని, ఒకవేళ ఉంటే వెంటనే పంపిస్తామని సమాధానమిచ్చారు. ట్రిపుల్‌ఆర్ విషయంలో ఉత్తర, దక్షిణ కోణంలో చూస్తూ, వేర్వేరుగా చూడొద్దని.. దక్షిణానికీ ఉత్తరానికిచ్చిన నంబరునే కొనసాగించాలని సీఎం కోరారు. అందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సుముఖత వ్యక్తం చేయగా, అయితే.. వెంటనే ట్రిపు ల్‌ఆర్ దక్షిణ అలైన్‌మెంట్‌కు వెంటనే ఆమోద ముద్ర వేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

విభజన చట్టంలోనే గ్రీన్ ఫీల్డ్ హైవే..

-అమరావతి, -మచిలీపట్నం 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను కోరారు. ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్రప్రభుత్వం డ్రైపోర్ట్, లాజిస్టిక్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తుందన్నారు. విభజన చట్టంలోనూ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదన ఉందని గుర్తుచేశారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేతో రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొన్నారు. తద్వారా సరుకు రవాణా సులభమవుతుందని, ప్రయాణికులకూ సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రా యపడ్డారు.

హైదరాబాద్- విజయవాడ మ ధ్య 70 కిలోమీటర్ల దూరం తగ్గితే, ఈ మా ర్గంలో వాహనాల రద్దీ పెరుగుతుందని, తద్వా రా ఆదాయమూ పెరుగుతుందని సీఎం పే ర్కొన్నారు. రహదారికి సమాంతరంగా తాము కేంద్రాన్ని రైలు మార్గం అడుగుతున్నామని, వందేభారత్ సహా ఇతర రైళ్ల రాకపోకలకు ఈమార్గం అనువుగా ఉంటుంది కాబట్టి రైల్వేశాఖకు ఎంతో లాభమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్- మార్గంలో రావిర్యాల- మన్ననూర్ ఎలివేటెడ్ కారిడార్‌కు వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు.

శ్రీశైలం దేవస్థానం, శ్రీశైలం రిజర్వాయర్, టైగర్ ఫారెస్ట్ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి నిత్యం పెద్దసంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తారని, ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతులు మంజూరు చేసి తక్షణం పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్- రహదారి పక్కన మర్రి చెట్ల తొలగింపుపై ఎన్జీటీలో ఉన్న కేసు పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం సూచించారు. హైదరాబాద్ మంచిర్యాల- నాగ్‌పూర్ నూతన రహ దారికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలకు అంగీకారం  తెలిపాలని సీఎం కోరారు. 

అటవీ పెంపకానికి ప్రత్యామ్నాయ భూమి... 

జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ, పర్యావరణ శాఖ కొర్రీలపై సీఎం సమీక్షించారు. 2002 22 వరకు పలు ప్రాంతాల్లో అటవీ, పర్యావరణపరమైన నిబంధనలను ఉల్లంఘన జరిగిందని, దీంతో ప్రస్తుతం ఆయా పనులపై అనుమతులు రావడం లేదని ఫారెస్ట్ సౌత్ రీజియన్ ఐజీ త్రినాథ్‌కుమార్ తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన అధికారులు ఇప్పుడు లేరని, ఉల్లంఘనలకు సంబంధించి వివరాలు సమర్పించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు.

అవసరమైనచోట ప్రత్యామ్నాయ భూమి కేటాయించి, అటవీ పెంపకం చేపట్టేందుకు సిద్ధమన్నారు. ఈ విషయంలో అవసరమైతే తాము జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసి పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. వన్యప్రాణులు లేని ప్రాంతాల్లోనూ వన్యప్రాణుల చట్టం అమలు చేస్తున్నారని, దీంతో అనుమతులు రావడం లేదని సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. నాన్ వైల్డ్ లైఫ్ ప్రాంతాల్లో వైల్డ్ లైఫ్ మిటిగేషన్ ప్లాన్‌కు ఎన్‌హెచ్‌ఏఐలో ప్రొవిజన్ లేదని, అందుకే అనుమతులు ఆలస్యమవుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. 

సమావేశంలో ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వీ శేషాద్రి, కేఎస్ శ్రీనివాసరాజు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీ వికాస్‌రాజ్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వినయ్‌కుమార్ రజావత్, ఎన్‌హెచ్‌ఏఐ సభ్యుడు (ప్రాజెక్ట్స్) అనిల్ చౌదరి, మోర్త్ రీజినల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్ ఆఫీసర్ శివశంకర్, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీం పాల్గొన్నారు.

తాగునీటి, మురుగునీటి నిర్వహణ వ్యవస్థలు వేర్వేరుగా ఉండాలి..

తాగునీటి, మురుగునీటి వ్యవస్థల నిర్వహణ వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి వాడి ఎవరైనా పట్టుబడితే, వారిని పునరావాస కేంద్రానికి పంపించాలని సూచించారు. నానాటికీ నగర విస్తరణ జరుగుతు న్నదని, ఏటా నగరానికి లక్షలాది కుటుంబాలు వలస వస్తున్నాయని తెలిపారు.

వలస వస్తున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. నగర సుందరీకరణపై మరింత దృష్టి సారించాలని సూచిం చారు. కోర్ అర్బన్ సిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలన్నింటినీ గుర్తించాలని, నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ఒక కేటగిరీ, 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు రెండో కేటగిరీ, 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు మూడు కేటగిరీలుగా విభజించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఆదేశించారు.

కబ్జాల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ భూముల్లో పాఠశాలల కోసం అధునాతన భవనాలు నిర్మించాలని సూచించారు. పిల్లలకు అల్పాహారం, భోజనం, స్నాక్స్ బడిలోనే అందించాలని, దీంతో తల్లిదండ్రులపై ఆర్థికభారం తప్పుతుందన్నారు. పేదలందరికీ నాణ్యమైన వైద్య సదుపాయలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెత్త సేకరణలో నిర్ల్యక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మున్సిపల్, జీహెచ్‌ఎంసీ అధికారులను సీఎం హెచ్చరించారు.

కోర్ అర్బన్ సిటీలో ఒక్క ప్రభుత్వ ఆఫీస్ అయినా అద్దె భవనాల్లో ఉండేందుకు వీల్లేదని, ప్రతి శాఖకు సొంత భవనం ఉండి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. సొంత భవనాలు లేని శాఖలకు వెంటనే భవనాలు నిర్మించాలని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఎదుట సోలార్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృ ష్ణారావు, డీజీపీ జితేందర్ పాల్గొన్నారు. 

ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ వినియోగించండి

హైదరాబాద్ నగరంలో వర్షం పడితే గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుందని, ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్‌శాఖ డ్రోన్ పోలీసింగ్ అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వెంటనే అందుకు అవసరమైన డ్రోన్లు కొనుగోలు చేయాలని సూచించారు. సచివాలయంలో సీఎం సోమవారం తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ జయేశ్‌రంజన్ మొత్తం 111 ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. నగరంలోని అన్ని జంక్షన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. ముఖ్యమైన జంక్షన్లలో వరద నిల్వ ఉండకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని సూచించారు. మున్సిపల్, పోలీస్, జలమండలి, విద్యుత్తుశాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్రైనేజీ, మ్యాన్ హోల్స్ శుభ్రతకు అవసరమైతే రోబోలు వాడాలని, యంత్ర పరికరాలతోనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు.

హుస్సేన్ సాగర్ 2.0లో భాగంగా ఆ ప్రాంతాన్ని అన్ని హంగులతో టూరిస్ట్ ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. స్కు వాక్, సైకిల్ ట్రాక్, మల్టీ లెవల్ పార్కింగ్ తో పాటు  పర్యాటకులను ఆకట్టుకునే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. కోర్ అర్బన్ సిటీలోని పార్కులన్నింటినీ పిల్లలను ఆకట్టుకునేలా, వారికి ఆహ్లాదకరంగా మార్చాలన్నారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీధి విద్యుద్దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగించాలన్నారు. 

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్..

మంచిర్యాల వరంగల్ -ఖమ్మం విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-163జీ ), ఆర్మూర్ -జగిత్యాల. -మంచిర్యాల (ఎన్‌హెచ్-63), జగిత్యాల -కరీంనగర్ (ఎన్‌హెచ్- 563), మహబూబ్‌నగర్ -మరికల్- దియోసుగూర్ (ఎన్‌హె-చ్167) రహదారులకు సంబంధించి భూసేకరణ, పరిహారం పంపిణీలో జాప్యంపై ఆయా జిల్లాల కలెక్టర్లను వీడి యో కాన్ఫరెన్స్‌లో సీఎం  ప్రశ్నించారు. పలుచోట్ల కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం దృష్టికి పలువురు కలెక్టర్లు తీసుకువచ్చారు.

అన్ని జిల్లాల్లో ఉన్న కేసులన్నింటిపై నివేదిక రూపొందించి, వారంలోపు అడ్వకేట్ జనరల్‌తో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. పరిహారం పంపిణీలో ఆలస్యంపై సీఎం ప్ర శ్నించగా, నిధుల విడుదలలో జాప్యం ఉందని కలెక్టర్లు సమాధానమిచ్చారు. ఈ విషయంపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు స్పందిస్తూ.. జాబి తా అప్‌లోడ్ అయిన భూములకు సంబంధించి వెంటనే నిధులు విడుదల చేస్తున్నా మని, కలెక్టర్లు ఆ పనులు త్వరగా పూర్తి చేయా ల్సి ఉందన్నారు. భూసేకరణ, పరిహారం పంపిణీని అక్టోబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.