calender_icon.png 23 September, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ వర్సిటీలో ప్రమోషన్ల లొల్లి

23-09-2025 12:56:57 AM

-కోర్టులో 2014 రిక్రూట్మెంట్ 

-అక్రమ దారిలో ప్రమోషన్లకు స్కెచ్ 

-గతంలో ఎన్నో ఆరోపణలు 

-గవర్నర్ నామినీ ఏం చేసేనో..?

నిజామాబాద్, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): తెలంగాణ యూనివర్సిటీలో 2014 బ్యాచ్ ప్రొఫెసర్ల నియామకాల కథ కహానీ మళ్ళీ మొదలైంది. అక్రమ నియామకాలాంటూ పదేళ్లుగా పెద్ద దుమారమే రేగుతోంది. అలాంటి ఫైల్ కు మళ్ళీ కాళ్లు వచ్చాయని, అక్రమాలను సక్రమాలుగా  చేసేందుకు కదలికలు మొదలయ్యాయని తెలుస్తుంది.

యూనివర్సిటీల్లో నియామకాలు, పదోన్నతులకు సంబంధించి ఈ నెల 3న గవర్నర్ నామినీని నియామకం చేయడంతో గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్రమ పదోన్నతులకు మళ్ళీ రంగం  సిద్ధం చేశారని వినిపిస్తుంది.  2014 బ్యాచ్ ప్రొఫెసర్ల ప్రమోషన్స్ సంబంధించి రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి పైననే అప్పట్లో అనుమానాలు, ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కోర్టులో ఉన్న వ్యవహారానికి, ఆయనే పట్టుబట్టి హైదరాబాద్ స్థాయిలో చక్రం తిప్పారని విమర్శలు వచ్చాయి.

అప్పటి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి, అసలు అంశాలను కప్పి పూచ్చి, పదోన్నతులు కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించాడని వర్సిటీలో ప్రచారం జరిగింది. విద్యార్థి సంఘాలు దీనిపై మండిపడ్డాయి. నిజానికి రాష్ట్ర హైకోర్టులో పరిధిలో ఉన్న, ఈ కేసు తుది తీర్పు  ఇంకా రాలేదు. విచారణ దశలోనే ఉంది. 2014 నియామకాల సందర్భంగా సదరు ప్రొఫెసర్లు న్యాయస్థానం తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, హామీ పత్రం సైతం రాసి ఇచ్చారు.

అయితే రిజిస్ట్రార్  యాదగిరి మాత్రం, అసలు వ్యవహారాన్ని కప్పిపుచ్చి,  ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు వచ్చాయి. 2014లో అప్పటి వైస్ ఛాన్సలర్ ఆచార్య అక్బర్ అలీ ఖాన్ చేపట్టిన నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు కోర్టు మెట్లు ఎక్కారు.  రోస్టర్ కేటాయింపులో లోపాలున్నాయని, అర్హతలు, అనుభవం కాకుండా, అర్హతలేని వారికి నియామక పత్రాలు ఇచ్చారని అర్హులు పిర్యాదు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విద్యార్ధి సంఘాలు ఉద్యమాలు చేపట్టాయి.

ఫలితంగా 2014 నియామకాల వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లింది. అలాంటి ఫైల్ వ్యవహారం పదేళ్ల తర్వాత  మళ్ళీ కదలడం విస్తూరేపుతోంది. ఆచార్య రవీందర్  గుప్తా హయాంలోను 2014బ్యాచ్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇచ్చేందుకు, సుమారు  రూ. 3కోట్ల డీల్ కుదిరినట్టు ఆరోపణలు వచ్చాయి.  ఆ సమయంలో కూడా రిజిస్ట్రార్ గా యాదగిరినే ఉన్నారు. ఇద్దరు కలిసి పదోన్నతులు ఇవ్వడానికి సిద్ధపడడం, అదే సమయంలో మరో అవినీతే కేసులో అప్పటి వీసీ రవీందర్ గుప్తా ఏసీబీకి పట్టుబడడంతో అక్రమాల కథ కంచి చేరి, ఫైలు కదలికకు బ్రేక్ పడింది.

తదుపరి కొన్ని రోజుల తర్వాత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బూర వెంకటేశం గౌడ్ ని తప్పుదారి పట్టించి, ఆ ఫైల్ ను  క్లియర్ చేయించి, పదోన్నతులు కల్పించి, రూ.3కోట్లు కొట్టేసేందుకు పక్కా పథకం వేశారని తెలిసింది. అదే సమయంలో బూర వెంకటేశం గౌడ్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అవడంతో మళ్ళీ ఆ ఫైల్ కదలిక ఆగిపోయింది.  ఇలాంటి 2014 ప్రొఫెసర్ల నియామకాల ఫైల్ వ్యవహారం, ఈ నెల 3న నియామకమైన గవర్నర్  నామినీతో మళ్ళి తెరపైకి వచ్చింది. గవర్నర్ నామినీగా రిటైర్డ్ ఆచార్యుడు భూపతి రావు నియామించడంతో కొత్త చర్చ మొదలైంది.

స్మానియా విశ్వ విద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ప్రస్తుత తెలంగాణ వర్సిటీ వీసీ ఆచార్య యాదగిరి రావుకి ఆయన దగ్గరి బంధువు అవుతారని వినికిడి. నిజానికి సర్వీసులో ఉన్నవారనే గవర్నర్ నామినీగా నియమించాలి.  నియామకాల్లో, పదోన్నతుల్లో ఎలాంటి అవకతవకలు జరిగిన నామినినే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కావున ఉద్యోగంలో కొనసాగుతున్న వారినే నియమించడం ఆనవాయితీ అయితే ఈయన నియామకంలో  వీసీ యాదగిరీర్ రావు కీలకంగా వ్యవహరించాడని వర్సిటీలో చర్చ సాగుతోంది.

ఇప్పటికే ప్రమోషన్లు త్వరగా చేపట్టాలని వీసీకి పలువురు వివాదాస్పద నియామకపు అభ్యర్థులు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే కొందరు ప్రొఫెసర్లు భూపతి రావును కలిసి, రహస్యంగా చర్చలు జరిపినట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి.  అయితే పూర్తి స్థాయి పాలకమండలి ప్రస్తుతం లేదు. ఏ నిర్ణయానికైన పాలక మండలి ఆమోదం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో కోర్టు పరిధిలోని ఈ ఫైల్ ను వీసీ క్లియర్ చేస్తారా? లేదంటే కోర్టు పరిధిలోని వ్యవహారం అంటూ మూలన పడేస్తారో వేచి చూడాలి మరి.