18-08-2024 12:00:00 AM
నిర్మాణ సంస్థలను ఆదేశించిన మహారాష్ట్ర రెరా
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 17 (విజయక్రాంతి): కొనుగోలు చేసిన ఫ్లాట్లలో సౌకర్యాలు ఎప్పటిలోగా కల్పిస్తారో, అందుకు సంబంధించిన కాలపరిమితి ని కొనుగోలుదారులకు చెప్పాల్సిందేనని మహారాష్ట్ర రెరా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ ప్రాజెక్టుల్లో కల్పిస్తామని చేసిన ప్రకటన ప్రకారం సౌకర్యాల వివరాలను కూడా వెల్లడించాలని నిర్మాణ సంస్థలకు సూచించింది. రెరాలో పొందుపర్చిన గడువులోపు పలు నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులను కొనుగోలుదారులకు అప్పగిస్తున్నప్పటికీ, వాటిలో కల్పించాల్సిన సౌకర్యాలను పూర్తి చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారు. అలాగే కొందరు మధ్యలోనే వదిలేసి పోతున్నారు.
దీంతో కొనుగోలుదారులకు, బిల్డర్లకు తరచూ గొడవలు జరగడంతోపాటు రెరాకు పెద్ద ఎత్తును ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర రెరా నిర్మాణదారులకు, సంస్థలకు షాక్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టును చేపట్టిన బిల్డర్ ప్రాజెక్టుతోపాటు అందులో పేర్కొన్న సౌకర్యాలకు సంబంధించిన కాలపరిమితిని కూడా కొనుగోలుదారులకు ముందే చెప్పాలని స్పష్టం చేసింది. ఇందులో ప్రధానంగా కామన్ ఏరియాల్లో చేపట్టే నిర్మాణాలతోపాటు లే అవుట్ వివరాలను తెలపాలని, అలాగే వీటిని ఫ్లోర్ స్పేస్ ఏరియా పరిధిలో నిర్మిస్తున్నారా? లేదా? అనేది కూడా స్పష్టం చేయాలని రెరా సూచించింది.