15-05-2025 12:00:00 AM
కేశవ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సులు
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (ఏఈడీపీ)కు ఆదరణ పెరుగుతున్నది. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ డిగ్రీ పాఠ్యాంశాల్లో అంతర్భాగంగా అప్రెంటిషిప్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. జూలై 2025 నుంచి ప్రారంభమయ్యే రాబోయే విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అప్రెంటిషిప్స్ కొనసాగించడానికి నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్ అవకాశం కల్పిస్తున్నదని ప్రిన్సిపాల్ వేదుల శాంతి తెలిపారు.
విద్యార్థులు ఏఈడీపీ అప్రెంటిషిప్స్, వారి అధ్యయనాలతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలను పొందేందుకు వీలుగా మార్గదర్శకాలను అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సోమవారం ఉన్నత విద్యా సంస్థలను కోరింది. ఈ మేరకు కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ‘విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడం, ఫలితాల ఆధారిత అభ్యాసంపై దృష్టి పెడుతున్నది.
పరిశ్రమల మధ్య క్రియాశీల సంబంధాన్ని ప్రోత్సహించి, పరిశ్రమలలో నైపుణ్య అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు చదువు కొనసాగిస్తున్న సమయంలోనే కోర్సులకు సంబంధించి నైపుణ్యాలపై సాంకేతిక శిక్షణ ఇస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో బాగా రాణిస్తున్న బీబీఏ (లాజిస్టిక్స్), BBA (రిటైల్ ఆపరేషన్స్)తోపాటు మరిన్ని కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అవి బీకాం(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్), బీఎస్సీ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆపరేషన్స్), బీఎస్సీ డిజిటల్/ఇండస్ట్రీయల్ ఎలాక్ట్రానిక్స్, బీఎస్సీ (మార్కెటింగ్ అండ్ సేల్స్), బీఎస్సీ(ఫార్మాస్యుటికల్ మ్యాన్ఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ), బీబీఏ (కాంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్) కోర్సుల్లో ఈ అవకాశం కల్పిస్తున్నట్టు కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్ ప్రిన్సిపాల్ వేదుల శాంతి తెలిపారు.