calender_icon.png 12 August, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సృష్టి కేసు.. కీలక విషయాలు వెల్లడించిన నార్త్ జోన్ డీసీపీ

12-08-2025 02:06:08 PM

సరోగసీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు.. నెట్ వర్క్ లా ఏర్పడి దందా

హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్( Srushti Fertility Centre Case) కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 26 మందిని అరెస్ట్ చేసినట్లు గోపాలపురం పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్(North Zone DCP Rashmi Perumal ) మీడియా ముందు వివరించారు. రెండు మూడు సార్లు సరోగసీ చేసిన వారు ఓ నెట్ వర్క్ లా ఏర్పడ్డారని ఆమె తెలిపారు. నిందితులకు పలువురు వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లతో సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పారు.

ఆడ శిశువుకు రూ. 3.50 లక్షలు, మగ శిశువుకు రూ. 4.50 లక్షలుగా ధరలు నిర్ణయించారు. కొందరు ధనవంతులైన తల్లిదండ్రుల వద్ద రూ. 30-40 లక్షల వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోందని డీసీపీ పేర్కొన్నారు. ఈ దందాలో చాలా మంది ఏజంట్లు కీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణలోని అనేక నగరాలు, పట్టణాల్లో ఈ దందా సాగించినట్లు సమాచారం వస్తోందని డీసీపీ రష్మీ పేర్కొన్నారు. వాణిజ్యపరంగా సరోగసీ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇప్పటికే నిషేధించిందని, సరోగసీ విషయంలో ఇలాంటి దందాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.  ఇప్పటివరకూ 26 మందిని అరెస్ట్ చేశాం.. కొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. అరెస్టు అయిన వారిలో ఇద్దరు ఏపీలోని కేజీహెచ్ కు చెందిన వైద్యులు ఉన్నారని నార్త్ జోన్ డీసీపీ పేర్కొన్నారు.

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో బయటపడిన అక్రమ సరోగసీ, శిశువుల అమ్మకపు రాకెట్‌ను డాక్టర్ నమ్రత, ఆమె బృందం నడుపుతున్నప్పుడు అనుమానిత మనీలాండరింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దర్యాప్తు చేసే అవకాశం ఉంది. నిందితులు హవాలా లావాదేవీల ద్వారా ఖాతాదారుల నుండి పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో ప్రమేయం ఉందనే అనుమానంతో హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే సంతానోత్పత్తి కేంద్రం వ్యవహారాలను విచారిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి పిల్లలను సేకరించి, పిల్లలు లేని జంటలకు సరోగసి పిల్లలుగా సరఫరా చేయడానికి కేంద్రం పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు నిర్వహించిందని ఈడీ అనుమానిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.