12-08-2025 01:16:22 PM
హైదరాబాద్: మంత్రి పదవి(Minister Post) విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చారు.. ఇచ్చినప్పుడు ఇవ్వండని డిమాండ్ చేశారు. ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా?, లోక్ సభ ఎన్నికల్లో రెండోసారి హామీ ఇచ్చినప్పుడు తెలియదా? అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చారని చెప్పిన ఆయన 11 మంది గెలిచిన నల్గొండ జిల్లాకు(Nalgonda district) ముగ్గురు మంత్రులు ఉంటే తప్పా? అన్నారు. అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే అని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇద్దరం గట్టి వాళ్లమే.. ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. ఆలస్యమైనా సరే.. ఓపిక పడుతున్నా అని ఆయన స్పష్టం చేశారు.
''కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నాను.'' అంటూ ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్క పేపర్ క్లిప్ ను ఎక్స్ లో పోస్టు చేశారు.