12-08-2025 01:19:40 PM
గణనాథున్ని దర్శించుకుని పునీతుడైన భక్తులు
మంథని,(విజయక్రాంతి): శ్రీ గణనాథుని పూజిస్తే అంతా శుభం జరుగుతుంది. అంగారక సంకష్టహర చతుర్థి(Angaraka Chaturthi) సందర్భంగా మంగళవారం గణనాథుని ఆలయాలు భక్తులతో పండుగ వాతావరణం నెలకొంటుంది. దైనందిన జీవితంలో మానవులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ సంకష్టహర చతుర్థి దీక్షతో తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. కొత్తగా చతుర్థి దీక్ష తీసుకునేవారు అంగారక చతుర్థి రోజున దీక్ష తీసుకోవడం ఎంతో శ్రేయష్కారం. ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధికమించడానికి సంకష్టహర చతుర్థి రోజున ఉపవాస దీక్ష చేపట్టడం అనాదిగా పాటిస్తున్న నియమం. సంకష్టహర చతుర్థి రోజున శ్రీ విఘ్నేశ్వరుని పూజించి ఆలయంలో 21 ప్రదక్షిణాలు చేసి మోదకులు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మంథని పట్టణంలోని శ్రీ మహా గణపతి దేవాలయంలో సిద్ధి, బుద్ధి సమేతంగా కొలువుతీరిన గణనాథున్ని సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని మంగళవారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
గణపతికి ఇష్టమైన వారం మంగళవారం అలాగే నవగ్రహాల్లోని కుజ గ్రహ దోషం పోవాలన్న మంగళవారం వచ్చే అంగారక చతుర్థి రోజున "ఓం గం గణపతియై నమః " అని స్మరిస్తూ విఘ్నేశ్వరున్ని దర్శించుకుంటే అన్ని సంకటాలు తొలగిపోతాయి. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజున సంకష్టహర చతుర్థి వస్తుంది ఏడాదిలో ఒకసారిమంగళవారం వచ్చే చతుర్థి ని అంగారక అంటారు. ఈ రోజున రాత్రి 9 గంటలకు చంద్రోదయం అనంతరం స్వామివారికి పూజ చేసి భోజనం చేయడం ఎంతో శ్రేయష్కారం. ఈ రోజున ఉపవాస దీక్ష స్వీకరిస్తే జీవితంలో ఎదుర్కొంటున్న విజ్ఞాలన్ని తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా శ్రీ మహాగణత దేవాలయాన్ని ఎంతో అందంగా అలంకరించారు.
దేవతలలో మొట్టమొదట పూజించబడే ఎంతో విశిష్టత కలిగిన శ్రీ విఘ్నేశ్వరున్ని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోయి అంతా శుభం జరుగుతుందనే విశ్వాసంతో సంకష్టహర చతుర్థి దీక్షను స్వీకరిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరునికి ఇష్టమైన గరిక ( దూర్వాలు ) సమర్పించడం అలాగే 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే విఘ్నేశ్వరునికి ప్రీతిపాత్రలవుతారు అని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ రోజున చంద్రోదయం అనంతరం భోజనం చేయడం ఈ దీక్షలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆలయ పూజారి పల్లి రాము భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.