12-08-2025 02:20:27 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. మంగళవారం 5 గంటలకు కలెక్టర్లు(district collectors), ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించనున్నారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవడం, పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన సీఎం అలాంటి ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నందున ఐటీ కంపెనీల ఉద్యోగులకు మధ్యాహ్నం 3 గంటలకే లాగౌట్ చేయాలని పోలీసులు సూచించారు. అటు వరంగల్, హన్మకొండలో సోమవారం రాత్రి చాలా భారీ వర్షం కురిసింది. 200 మి.మీ కంటే ఎక్కువ. దీని కారణంగా, చాలా చోట్ల వరదలు వచ్చాయి. కొన్ని రోడ్లు మూసుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలలోకి నీరు ప్రవేశించింది. అకస్మాత్తుగా వరదలు రావడంతో కొన్ని ప్రాంతాలలో ప్రజలు చిక్కుకుపోయి ఇబ్బంది పడ్డారు. అప్రమత్తమైన అధికారులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.