03-09-2025 03:57:12 PM
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 21 నెలలు అవుతోందని, కాంగ్రెస్ 21 నెలల పాలనలో ఏ ఒక వర్గము సంతోషంగా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. ఎర్రవల్లి నుంచి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నారని, మరీ ముఖ్యంగా యూరియా విషయంలో రైతులు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి రైతునోట వెంట.. అప్పటిరోజులే బాగుండే అంటున్నారని కేటీఆర్ తెలిపారు. 2014కు ముందు వ్యవసాయ ఉత్పత్తిలో తెలంగాణ చాలా వెనుకబడి ఉండేదని.. ఒక్కొక్క నీటిబొట్టును ఒడిసిపట్టి 14 స్థానం నుంచి ఒకటో స్థానానికి వచ్చామని అన్నారు.
సముద్రమట్టానికి సిద్దిపేట జిల్లా 600 మీటర్ల ఎత్తులో ఉంటుందని, గోదావరి జలాలను వాడుకోవలంటే ఎత్తిపోతల ప్రాజెక్టులు తప్పనిసరి అని తెలిపారు. మేడిగడ్డ వద్ద అయితే ఏడాది పొడవునా నీటిలభ్యత ఉంటుందని భావించారని, కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా హుస్సేన్ సాగర్ వంటివి రోజుకు రెండు నింపోచ్చని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని, కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి 600 మీటర్ల ఎత్తులో ఉన్న గజ్వేల్ కు నీరు తీసుకెళ్లారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ పై కుట్ర చేస్తున్నాయని అన్నారు. అంతటి గొప్ప కాళేశ్వరం కట్టిన కేసీఆర్ పై సీబీఐ కేసులు పెడుతున్నారని, సీబీఐ అనేది బీజేపీ జేబు సంస్థ అని రాహుల్ గాంధీ రోజూ అంటున్నారని కేటీఆర్ తెలిపారు.