30-12-2025 12:00:00 AM
చిన్నజీయర్ స్వామి
ముగిసిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మహాసభలు
మణికొండ, డిసెంబర్ 29 (విజయక్రాంతి): తెలుగు భాష, సాహిత్యం, సంస్కృ తి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత అని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు సమాజం ఏకతాటిపైకి రావడానికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) వేదికగా నిలవాలని ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు తెలుగు విలువలను అందించే దిశగా నాయకత్వం మరింత కృషి చేయాలని సూచించారు. గండిపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని అక్షయా కన్వెన్షన్స్లో ఆదివారం ముగిసిన జీటీఏ తొలి మహాసభలో ఆయన ప్రసంగించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి దాదాపు 2,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
2023 లో హైదరాబాద్లో ప్రారంభమైన జీటీఏ, తక్కువ కాలంలోనే 45 దేశాల్లో చాప్టర్లను స్థాపించుకోవడం విశేషమని అభినందించా రు. తెలంగాణ ప్రజల నాయకత్వ సామర్థ్యం, గ్లోబల్ స్థాయిలో ప్రదర్శిస్తున్న ప్రతిభపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.కార్యక్రమ ప్రధాన వక్తగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీటీఏ చేపట్టిన కార్యక్రమాలను మెచ్చుకున్నారు. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు చేపడుతున్న సేవా కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రసంగిస్తూ సంస్థ సేవలను కొనియాడారు.
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపక చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మరిన్ని చాప్టర్లు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల అవసరాలకు, ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రెండో రోజు కార్యక్రమంలో విద్యారణ్య భారతీ స్వామి, ప్రజాప్రతినిధులు రామ్మోహన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, అనిల్ రెడ్డి కుంభం హాజరయ్యారు. రసమయి బాలకిషన్ ప్రజాగీతాలు, పరంపర ఫౌండేషన్ కళాకారుల నృత్య ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జీటీఏ యూఎస్‌ఏ అధ్యక్షుడు ప్రవీణ్ కేశిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రవణ్ పడురు, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సంతోష్ కాకులవరమ్, వర్జీనియా చాప్టర్ అధ్యక్షుడు తిరుమల పుల్లూరి పాల్గొన్నారు.