2 May, 2026 | 6:34 AM

మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

09-12-2024 10:32 PM

మహిళా సమస్యలు పరిష్కారం కోరుతూ మహిళల ప్రదర్శన 

ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ 

ఖమ్మం (విజయక్రాంతి): దేశంలో  నిత్యం ఏదో ఒక చోట పసి వయసు నుంచి పండు ముసలి వరకు మహిళలపై హింస, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, అరికట్టాల్సిన పాలకులు పట్టించుకోవడం లేదని, చట్టాలు డబ్బున్న వారికి చుట్టాలుగా మారాయని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ అన్నారు. మానవ హక్కుల దినోత్సవం సందర్బంగా అఖిల భారత  ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలోని పాత బస్టాండ్ నుంచి జిల్లా పరిషత్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్లాకార్డులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో బుగ్గవీటి సరళ మాట్లాడుతూ.. పాలకులు కళ్లుండి గుడ్డివారిగా నటిస్తున్నారని అన్నారు.

మహిళలకు ఆహార భద్రత కల్పించాలని రాజ్యాంగం ఆదేశించినా పాలకులకు చిత్తశుద్ధి లేకుండా పోయిందన్నారు. మహిళా సాధికారతకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును చట్ట సభల్లో ఆమోదించి, అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనేక మంది అర్హులైన వితంతువులు, వికలాంగులు, పేదలు పెన్షన్ కు దరఖాస్తు చేసినా రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు నాగ సులోచన, పి.ప్రభావతి, పెంట్యాల సుమతి, జొన్నలగడ్డ సునీత, జి.రజిత, కృష్ణవేణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.