calender_icon.png 18 October, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గౌరవెల్లి’లో మునిగిన గుడాటిపల్లె

18-10-2025 01:34:55 AM

-అక్రమార్కులకునిధుల ముల్లె..! 

-ఊరు లేకున్నా రూ.1.15లక్షలతో స్ట్రీట్ లైట్లు వెలిగాయట..

-నేలమట్టమైన గ్రామంలో రూ.2.94 లక్షలతో చెట్లు పెంచారట..

-చెట్లు ఎదిగేందుకు రూ.70వేలతో కట్టెలు పాతారట..

-రూ.48 లక్షల అవినీతి  కుంభకోణం..?

హుస్నాబాద్, అక్టోబర్ 17 : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లె గౌరవెల్లి ప్రాజెక్టులో మునిగిపోయినా, అవినీతి రికార్డులలో తేలుతూ కనిపిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంతో ఈ గ్రామం ఇప్పటికే ముంపునకు గురై, అధికారికంగా భూసేకరణ జరగడంతో నివాసాలు లేకుండా పోయాయి. అయితే ప్రభుత్వ పథకాల లబ్ధి చూపుతూ కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి రూ.48 లక్షల వరకు మింగా రనే ఆరోపణలు వస్తున్నాయి.  గ్రామం లేని చోట హరితహారం, వీధి దీపాలు, మోటార్ల పేరిట ఆ ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ రద్దయిన తర్వాత కూడా ప్రభుత్వ రికార్డుల్లో ‘పనులు‘ కొనసాగినట్టు చూపడం ఈ అక్రమాల లోతును స్పష్టం చేస్తోంది.

మట్టిలో కలిసిన గ్రామం.. లెక్కల్లో మాయాజాలం!

అధికారికంగా 2023 అక్టోబర్ 5న గుడాటిపల్లిని ముంపు గ్రామంగా ప్రకటించారు. గ్రామస్తులు తమ ఇండ్లను, జ్ఞాపకాలను వదిలి వెళ్లిపోయారు. గ్రామ పంచాయతీ భవనంతోపాటు ఇతర ప్రభుత్వ భవనాలు, ఇండ్లు నేలమట్టమయ్యాయి. అయినా ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ‘అభివృద్ధి‘ ఆగలేదు.  ప్రభుత్వ నిధుల వినియోగ వివరాలను వెల్లడించే అధికారిక వ్బుసైట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే, గ్రామం కనుమరుగైన తర్వాత కూడా భారీగా నిధులు విడుదలైన వైనం కండ్లు బైర్లు కమ్మేలా ఉంది. 2023 అక్టోబర్ 23న : రూ.1,14,912 వీధి దీపాల ఏర్పాటుకు ఖర్చయినట్లు చూపారు. గ్రామంలో ఒక్క వీధి కూడా లేనప్పుడు, ఈ లైట్లు ఎక్కడ వెలిగాయో అధికారులు సమాధానం చెప్పాలి.

2024 అక్టోబర్ 25న: రూ.2,94,000 హరితహారం మొక్కల కోసం వెచ్చించారు. నేలమట్టమైన గ్రామశివార్లలో మొక్కలు పెరిగే మాయాజాలం ఎక్కడ జరిగిందో వివరించాలి. 2024 అక్టోబర్ 24న: రూ.70,000 హరితహారం కట్టెల కోసం ఖర్చయినట్లు నమోదు చేశారు. అసలు మొక్కలే లేనప్పుడు, కట్టెలు ఎక్కడ పెట్టారో అర్థం కావడం లేదు. దీంతోపాటు 2024-25 ఫైనాన్స్ ఇయర్ లో ఒక మహిళ పేరుమీద 13బిల్లులతో కూడిన రూ.5,18,638 స్వాహా చేశారు. కారోబార్ పేరుపై 7 బిల్లులతో కూడిన రూ.4,55,200 మింగారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే ఈ కుంభకోణం  వెనుక ఎవరున్నారు? ఎంత ధనాన్ని మింగారనేది తేలుతుంది.

పంచాయతీ రద్దుకు ముందే స్కెచ్!

ఈ కుంభకోణం కేవలం నిధుల దుర్వినియోగంతో ఆగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. దీని వెనుక పాత ప్రజాప్రతినిధులు, కొందరు అధికారుల అండదండలు ఉన్నాయని వారు బలంగా అనుమానిస్తున్నారు. పంచాయతీ అధికారికంగా రద్దు కాకముందే, పెద్ద ఎత్తున ఆస్తుల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. గ్రామ పంచాయతీ భవనం, పాఠశాల భవనాలు, వాటర్ ట్యాంకుల ఇనుప చువ్వలు సహా విలువైన వస్తువులన్నీ అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు. గ్రామంలోని చెరువుల నుంచి ఏకంగా 14 మోటార్లు మాయమయ్యాయి.ఈ ఆస్తుల విక్రయం ద్వారా లక్షల రూపాయలు గోల్మాల్ అయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి.

ఉపాధి హామీ పథకంలో  ‘50-50’ డీల్!

గ్రామమే లేనప్పటికీ, ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఏ) కింద కూడా అవినీతి రాజ్యమేలింది. పనులు జరగకుండానే కార్డుదారుల పేరిట నగదు చెల్లింపులు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలనలో, ఫీల్ అధికారి, కాంట్రాక్టర్, కార్డుదారుల మధ్య 50:50 నిష్పత్తిలో లావాదేవీలు జరిగినట్లు బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. దీనివల్ల వలసపోయిన నిరుపేదలకు ఒక్క రూపాయి కూడా అందలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

ప్రజల్లో ఆగ్రహం ‘న్యాయానికి ఇది పరీక్షా సమయం!’

ఈ కుంభకోణంపై గ్రామ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నేలమట్టమైన గ్రామంలో రెండేండ్ల తర్వాత కూడా నిధుల విడుదల ఎలా జరిగిందని, ఈ అక్రమాలకు పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న ప్రతి ఒక్కరిపై తక్షణమే కేసులు నమోదు చేసి, పూర్తిస్థాయి విచారణ జరిపి, నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుడాటిపల్లె కుంభకోణం కేవలం ఒక గ్రామానికే పరిమితం కాదని, ఇది ప్రభుత్వ వ్యవస్థల్లోని లోపాలను, పాలకుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోందని అన్ని వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. గుడాటిపల్లె అవినీతి చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది రాష్ట్ర పాలనా వ్యవస్థలోని లొసుగులను, అక్రమార్కుల అరాచకాలను ఎత్తిచూపే ఉదాహరణ. ఇప్పటికైనా ప్రభుత్వం నైతిక బాధ్యత తీసుకొని, నిజాలను వెలుగులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.