18-10-2025 01:32:23 AM
-సెట్‌బ్యాక్ స్థలాలు అక్రమిస్తే చర్యలు తప్పవు త్వరలోనే నోటీసులు జారీ చేస్తాం
-సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్
సిద్దిపేట, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : సిద్దిపేట పట్టణంలోని కమర్షియల్ కాంప్లెక్స్ ల యజమానులు ట్రాఫిక్ నిబంధనలకు లోబడి వ్యాపారాలు నిర్వహించుకునే సౌకర్యం కల్పించాలని సిద్ధిపేట ట్రాఫిక్ సిఐ కే ప్రవీణ్ కుమార్ సూచించారు. పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల జోన్ లో పార్కింగ్ సమస్యలపై విజయక్రాంతి ప్రచురించిన కథనాలపై స్పందించారు. శుక్రవారం సీఐ కే.ప్రవీణ్ కుమార్ విజయక్రాంతితో మాట్లాడుతూ. జిల్లా కేంద్రంలో అత్యధికంగా రద్దీగా ఉండే స్థలాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఏర్పాటు చేశామన్నారు.
ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో నిరంతరంగా రద్దీగా ఉంటుందని, విద్యార్థులు ప్రయాణికులు రోడ్డు దాటాల్సినప్పుడు జాగ్రత్త పడాలన్నారు. మైనర్ బాల బాలికలకు వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు హెచ్చరించారు. ప్రతిరోజు వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు మైనర్స్ పదుల సంఖ్యలో పట్టుబడుతున్నట్లు తెలిపారు. పట్టుబడిన మైనర్స్ కు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, హెల్మెట్ ధరించకుండా నడపొద్దని సూచించారు.
పాఠశాలల సమయాలలో తల్లిదండ్రులు పిల్లలను బైక్ పై కూర్చోబెట్టుకొని రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తున్నారని ఇది ప్రమాదాలకు కారణం అవుతుందని తెలిపారు. శబ్ద కాలుష్యం పెంచే విధంగా బైక్ లకు సైలెన్సర్లు ఉంటే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా నడుపొద్దని సూచించారు. సిద్దిపేట పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల ప్రాంతంలో భవనాల యజమానులు సెట్ బ్యాక్ స్థలాలను ఆక్రమించడం సరికాదన్నారు. పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల ఆస్పత్రులకు వచ్చిన రోగుల వాహనాలు రోడ్లపైనే నిలుపుతున్నారని దాంతో అత్యవసర సేవలైన అంబులెన్స్ లకు సైతం దారి లభించడం లేదని చెప్పారు.
అనేక ఆసుపత్రుల భవనాల యజమానులు సెట్ బ్యాక్ స్థలాలను ఆక్రమించడం గుర్తించామన్నారు. వారు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించుకోవాలని ఆదేశించారు. లేదంటే నోటీసులు జారీ చేసి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల జోన్ లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిబంధనలు ఉల్లంఘించిన భవన యజమానులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవలనే పట్టణంలోని బార్, మద్యం దుకాణాల నిర్వాహకులు, యజమానులతో సమావేశం నిర్వహించి నిబంధనలు వివరించమని తెలిపారు.