2 May, 2026 | 12:08 AM

గుండేరావు తాతయ్య నోటివాక్కు

08-06-2024 12:05 AM

‘ఏది, ఎక్కడ, ఎలా రాసి పెట్టివుంటే అది, అక్కడ, అలాగే జరుగుతుంది’ అని పెద్దలు అంటుంటారు.  అది నిజమే అనిపిస్తుంది. నేను ప్రాచ్య కళాశాల విద్యార్థిని. డిగ్రీ పరీక్షలు పూర్తి కాగానే భాగ్యనగరాన్ని విడిచి స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అప్పటి కి నేను శాలిబండలో అద్దె లేని ఇంట్లో వున్నాను. ఇల్లు ఇచ్చిన వారి పిల్లలకు ట్యూషన్ చెప్పడం వల్ల ఆ అదృష్టం కలిగింది. పరీక్షలు పూర్తయ్యాయి కాబట్టి, నగ రాన్ని విడిచి వెళ్తున్నాను. కనుక నన్ను ‘కవీశ్వరా’ అని ప్రేమతో పిలిచే గుండేరావు గారికి చెప్పి, సెలవు తీసుకోవాలని అనుకున్నాను. సైకిల్‌మీద గౌలిపురాకు వచ్చాను, నా సామాన్లన్నీ ఒక పెట్టెలో సర్దుకొని. అప్పటికి గుండేరావు తాతయ్య టిఫిన్ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు.

నా రాక తెలిసి లేచి కూర్చున్నారు. నేను వారి పాదాలను స్పృశించి, “తాతయ్యా! నా పరీక్షలు పూర్తయ్యాయి. ఊరికి వెళ్లిన తర్వాత మా మండలంలో ఎక్కడో ఒకచోట ఓ తెలుగు పండితునిగా ఉద్యోగం సంపాదించుకుంటాను. నేను పండిత శిక్షణకూడా పొందినవాణ్ణి. మీ దయ కావాలి” అని వారి ఆశీర్వాదం కోసం ఎదురుచూశాను. గుండేరావు తాతయ్య ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. కానీ, మరు క్షణం వారు, “ఒక నాల్గు రోజులుండి పోరాదూ” అన్నారు. నేను పుస్తకా లు, బట్టలు సర్దుకొని సందూక చేత బట్టుకొని వచ్చినవాణ్ణి. ‘తిరిగి శాలిబండకు పోవాలా ఏమిటి?’ అని ఆలోచనలో మునిగిపోయాను. వెంటనే తాతయ్య నా వాలకాన్ని కనిపెట్టి, “నువ్వు ఇక్కడే మన ఇంట్లో ఉండవచ్చు. నీకుపూ నాల్గేండ్ల అనుబంధం. ఒక నాల్గు రోజులు ఉంటే సరి” అన్నారు. వారి మాటలు తీసివేయలేక వారితో ఉండిపోయాను. 

మూడు రోజులు గడిచాయి. నాల్గవ రోజు నాకు ‘నేను శాలిబండలో వున్న ఇంటి పక్కనగల నర్సిరెడ్డి సారు’ గుర్తుకు వచ్చారు. వారికి ఇంటినుంచి బయల్దేరేటప్పుడు చెప్పలేదు. కనీసం, ఈ రోజైనా చెప్తే బాగుంటుందని శాలిబండకు వచ్చా ను. వారు నన్ను చూడగానే, “చెన్నప్పగారూ! మీ కోసం చూస్తున్నాను. మీరు ఊరెళ్లి పోయారని తెలిసింది. విషయం ఏమిటంటే, సికింద్రాబాద్‌లోని ఇస్లామియా బాయిస్ హైస్కూల్‌లో తెలుగు పండితుని పోస్టు ఉన్నట్లు పత్రికలో వచ్చింది. నీకిది ఉపయోగపడుతుంది” అని పత్రికను నా చేతికిచ్చారు. పత్రికను చేత పట్టుకొని గుండేరావు తాతయ్య దగ్గరికి వచ్చి, విషయాన్ని వివరించాను.

వరించి వచ్చిన ఉద్యోగం

ఆయన ఆశీర్వాద పూర్వకంగా “ఇంకేమి, అప్లయి చెయ్యి. నీకే ఉద్యోగం వస్తుంది. ఐతే, ఇస్లామియా హైస్కూల్ కనుక ఉర్దూ నేర్చుకోవాలి, నమాజ్ కూడా చేయాలి” అని నవ్వుకుంటూ అన్నారు. గుండేరావు గారి ఆశీర్వాదమంటే వట్టిది కాదు. ఆయన నిజాం ప్రభుత్వంలో నలభై ఏళ్లు న్యాయస్థానంలో పనిచేశారు. న్యాయపక్షంగా ఉండి ఎంతో పేరు తెచ్చుకున్నా రు. అడ్వర్టయిజ్‌మెంట్ ప్రకారం అదే చివరి రోజు అప్లయి చేయడానికి, ఇంటర్వ్యూకు కూడా చివరి రోజే. నేను హడావుడిగా తయారై, నా సర్టిఫికెట్లు తీసుకొని సైకిల్‌మీద సికింద్రాబాద్ మోండా మార్కెట్ వెనుక వున్న ఇస్లామియా పాఠశాలకు వచ్చాను. గేటుదాటి స్కూల్‌లోకి తొంగి చూశాను. నలభైమంది దాకా అభ్యర్థులు కూర్చొని ఉన్నారు.

అందరూ నాకు తెలిసినవారే. వారిలో ఉర్దూ మాతృభాషగా కలిగిన వారూ ఉన్నారు. ‘ఇంత మంది లో నాకేం వస్తుంది? ఒక్క ఉద్యోగానికి నలభైమంది! ఎవరేం ప్రయత్నాలు చేశారో పోస్టు సంపాదించడానికి’ అనుకుంటూ అప్లికేషన్ ఇవ్వకుండానే వెను దిరిగాను. ఇంతలో నా క్లాస్‌మేట్ ఒకతను గేటు దగ్గర ఎదురయ్యాడు. “ఇంటర్వ్యూ అయ్యిందా?” అని అడిగాడు. “అప్లికేషన్ ఇవ్వలేదు. అంతమంది ఉన్నారని తిరిగి వస్తున్నాను” అని జవాబిచ్చాను. “నీకేమైనా పిచ్చా? ఇంత దూరం వచ్చి అప్లికేషన్ ఇవ్వక పోవడం ఏమిటి? ఆ ఉద్యోగం నీకే వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అందరికంటే నీకే ఎక్కువ అకడమిక్ అవకాశాలున్నాయి” అన్నాడు. నేను అతని మాటలు కాదనలేక స్కూల్‌లోకి వెళ్లి ప్రిన్సిపాల్‌ను కలిశాను.

నిజానికి ఆ సమయంలో ప్రిన్సిపాల్‌తోపాటు గవర్నింగ్ బాడీ సభ్యులు ఇంట ర్వ్యూ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను లోపల ప్రవేశించి, “నా అప్లికేషన్ తీసుకుంటారా సార్?” అని కోట్ వేసుకున్న సార్‌ను అడిగాను. ఆయన పక్కన ఉన్న మరొక సారు నన్ను చూసి, “అప్లికేషన్‌తోపాటు ఇంటర్వ్యూ కూడా తీసు కుంటాం, కూర్చో” అన్నారు. బహుశా ఇంటర్వ్యూ ఇంకా మొదలు కాలేదన్న మాట. ‘నాతో మొదలైతే మంచిదే కదా’ అని కూర్చున్నాను. బోర్డు సభ్యులందరికీ చేతులు జోడించి నమస్కారం చెప్పాను. ఇంటర్వ్యూ పది నిమిషాలు జరిగింది.

అందులో పెద్ద గడ్డం ఉన్న సారు తెలుగులో ప్రశ్నలు వేశారు. వినయంగా సమా ధానాలు ఇచ్చాను. ఒక పద్యం చదవమంటే చదివాను. అర్థం చెప్పాను. “మీకు ఛందస్సు వచ్చునా?” అని అడిగారు. నేను “ఆశువుగా పద్యాలు చెప్పగలను” అన్నా ను. “మా పాఠశాల మీద చెప్పగలవా?” అని అందులో ఒక సారు అడిగారు. నేను తెలివిగా అంతకు ముందే తయారు చేసుకున్న పద్యాన్ని వినిపించాను. వారు సంతోష పడినట్లు గమనించాను. నన్ను వెళ్లి పొమ్మన్నారు. వారిలో పెద్ద గడ్డం సారు చూపులు నా మీదనే వున్నాయి. నేను వారికి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించి బయటపడ్డాను.

ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లకు ‘డెమో’ ఉంటుందని తెలిసింది. లెటర్‌ద్వారా వారు తెలియచేస్తామన్నారు. నేను సంతోషంగా గౌలిపురాకు బయలుదేరి ఇంటర్వ్యూ విశేషాలు తాతయ్య గారికి వివరించాను. వారు, “నువ్వు సెలెక్ట్ అవుతావు!” అని భరోసా ఇచ్చారు. ఆ ధైర్యంతో మరో నాల్గు రోజులు తాతయ్య ఇంట్లోనే ఉండి పోయాను. “డెమో ఇవ్వాలి. రండి” అని లెటర్ వచ్చింది. దాన్ని అందుకొని ఇస్లామియా హైస్కూల్‌కు బయలుదేరాను. ఆ రోజు నా ఒక్కని చేతనే ‘డెమో’ తీసుకోదలచినట్లుంది. పెద్ద గడ్డం సారు నన్ను ప్రేమతో ఆహ్వానించారు. 9వ తరగతి పిల్లలకు క్లాసు తీసుకోవాలి. ‘గోల్కొండ సుల్తానుల తెలుగు భాషా సేవ’ అనే పాఠం. అక్కడి వాతావరణాన్నిబట్టి ఆ పాఠం ఎన్నుకున్నాను. అంతేకాదు, చక్కగా చెప్పి పిల్లలను ఉత్సాహపరిచాను.

పాఠం అయిన తర్వాత పెద్ద గడ్డం సారు నన్ను కొద్దిసేపు ఆపి, స్కూల్ లైబ్రరీలోకి తీసుకొని వెళ్లారు. అది పెద్ద లైబ్రరీ. ఉర్దూ, ఇంగ్లీషు పుస్తకాలతోపాటు తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో వున్నాయి. ఆ స్కూలు 1882లో స్థాపితమైంది. లైబ్రరీ చాలా పెద్దది. ఆ పెద్ద గడ్డం సారు పేరు ఇనాయతుల్లా ఖాన్ అని తెలిసింది. నా ‘డెమో’ వారిని బాగా ఆకర్షించింది. కనుకనే ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకొని వెళ్లి, “ఇతణ్ణి ఎప్పుడు రమ్మం దాం?” అని అడిగారు. “ఓ మంచిరోజు చూసి రమ్మనండి. వారం పాటు అతడు చెప్పే క్లాసులనుబట్టి అపాయింట్‌మెంట్ ఆర్డరు ఇద్దాం” అన్నారు. నన్ను వారు సెలెక్ట్ చేసినట్లు అర్థమైంది. తర్వాత నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆ స్కూల్‌లో ఉద్యోగం రావడానికి కారణం గుండేరావు తాతయ్య గారే. వారు ఆ నాల్గు రోజులు నన్ను తమ ఇంట్లో ఉండమని చెప్పకపోతే హైదరాబాద్‌కు దూరమయ్యేవాణ్ణి.

వ్యాసకర్త సెల్: 9885654381