07-08-2025 04:51:50 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ మార్కెట్ లో డిమాండ్ కు అనుగుణంగా చేనేత ఉత్పత్తులను తీసుకురావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) చేనేతలకు సూచించారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో కాళోజీ సెంటర్ నుండి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకు చేనేత నడక(హ్యాండ్లూమ్ వాక్) కార్యక్రమాన్ని నిర్వహించారు. చేనేత నడకను జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాల అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ, జిల్లాలో 800 మంది నేత కార్మికులు ఉన్నారని చేనేత రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ కూడా ప్రభుత్వం చేసిందన్నారు. చేనేతను ప్రోత్సహించే విధంగా సలహాలు సూచనలు చేశారని తెలిపారు. చేనేత కార్మికులు తయారు చేస్తున్న బెడ్ షీట్స్, టవల్స్, ఇతరత్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఇంకా ఏవైనా ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇతర సంస్థలు స్కూల్స్, గురుకులాలు, హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా డైరెక్ట్ గా చేనేత ద్వారా అందించే వీలు ఉందా అనేది ఆలోచిస్తామన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలకు సంబంధించిన టెస్కో స్టాల్స్ ను నెలకోసారి ఐడిఓసీలో పెట్టాలన్నారు. జిల్లాలో చేనేత ఉత్పత్తులు తయారవుతున్నాయని అందరికీ తెలియజెప్పేందుకు స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు.
సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి దాదాపుగా 500 మంది వరకు ప్రజలు కలెక్టరేట్ కు వస్తుంటారని, జిల్లాలో చేనేత ఉత్పత్తులు తయారవుతున్న విషయం వారికి కూడా తెలియాలన్నారు. మార్కెట్ లో వేటికి మంచి ఆదరణ ఉందో వాటిని చేనేతలు ఉత్పత్తి చేయాలని సూచించారు. మార్కెట్లో వేటికి డిమాండ్ ఉందో వాటి గురించి చేనేత కార్మికులు తెలుసుకోవాలని కోరారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవిధంగా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా చేనేత సంబంధించిన వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించారు. చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యతను ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. చేనేత పై నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో విజేతలైన విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.