07-08-2025 07:14:43 PM
సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వెట్టిచాకిరికి గురవుతున్న వంట కార్మికులను ఆడుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి(CPI District Secretary Karre Bikshapathi) అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్రె బిక్షపతి మాట్లాడుతూ, 2002 సంవత్సరం నుండి ప్రభుత్వ విద్యా సంస్థల్లో పౌష్టికాహారం అందించాలని, కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధుల కేటాయింపుతో మధ్యాహ్న భోజనం పథకం కొనసాగుతోందని, అప్పటి నుండి వంట కార్మికులకు ఒక వెయ్యి రూపాయలు మాత్రమే గౌరవ వేతనం అందించి కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయన్నారు.
గత రాష్ట్ర ప్రభుత్వం 2000 వేల రూపాయలు పెంచి 3000 రూపాయలుగా నిర్ణయించి రెండు నెలలకు ఒకసారి, మూడు నెలలకు ఒకసారి డబ్బులు విడుదల చేసిందని, బిల్లులు సకాలంలో అందక వంట కార్మికులు అప్పులు తీసుకువచ్చి ఇబ్బందులకు గురవుతున్నారని, మరోవైపు వంట పాత్రలు, కోడిగుడ్లు, గ్యాస్ సిలిండర్లు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు10000 వేల రూపాయలు గౌరవ వేతనం అందిస్తామని చెప్పి ఇప్పటికి అమలు చేయలేదని అన్నారు. వంట కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, ప్రభుత్వమే వంట పాత్రలు, గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్లు సరఫరా చేసి కనీస వేతన చట్టాన్ని ప్రకారం 26 వేల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో తమ సమస్యల పరిష్కారం వెంటనే పరిష్కరించాలని వంటకార్మికులు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి ధర్మల రామ్మూర్తి అధ్యక్ష వహించగా ఏఐటీయూసీ జిల్లా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల సారంగపాణి, జక్కు రాజు గౌడ్, గడ్డం లలిత, ఇందిరా, రమాదేవి, ఒల్లాల లక్ష్మి, మునిగాల బిక్షపతి, రాజేశ్వరి, విజయ, జనగామ లక్ష్మి, కమల,అమృత,వనమాల, జక్కుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.