calender_icon.png 19 August, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులను జరుపుకోవాలి: సీఐ శ్రీనివాసరావు

19-08-2025 05:28:51 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులను జరుపుకోవాలని బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు కోరారు. మండపాల వద్ద భద్రత, బందోబస్తు కోసమే నిర్వాహకులు ఆన్లైన్ విధానంలో వివరాలు నమోదు చేసుకోవాలని చెబుతున్నట్లు చెప్పారు. పోలీసు శాఖ ఆన్లైన్ విధానం ద్వారానే మండపాలకు అనుమతి మంజూరు చేస్తుందన్నారు. .https://police portal.tspolice.gov.in ఆన్లైన్ లింకును క్లిక్ చేసి అందులో దరఖాస్తుదారులు వివరాలు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రాంతం, పోలీస్ స్టేషన్ పరిధి, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు, కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లు, విగ్రహం ప్రతిష్టించే రోజు, నిమజ్జనం చేసే సమయం, అందుకు వాడే వాహనం వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ప్రతి మండపం దగ్గర తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలన్నారు. గణేష్ మండపాలు ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వాడాలన్నారు. శోభాయాత్ర సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజే ను వాడవద్దని కోరారు. గణేష్ మండపాల్లో 24 గంటలు ఇద్దరు వాలంటీర్ సభ్యులు అందుబాటులో ఉండే విధంగా నిర్వాహకులు చూడాలన్నారు.

మండపాల వద్ద అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా రెండు బకెట్ల నీళ్లు, రెండు ఇసుక బస్తాలు, యాంటీ ఫైర్ ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడడం, అసభ్యకరమైన నృత్యాలు చేయడం, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పాడడం చేయవద్దని కోరారు. తప్పనిసరిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకొని తనిఖీకి వచ్చే పోలీసు అధికారులకు సహకరించాలన్నారు. మండపాల వద్ద ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.