calender_icon.png 19 August, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా పంపిణీపై పోలీసు నజర్!

19-08-2025 05:17:36 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత తీవ్రం కావడం, రైతులు తరచుగా ఆందోళనలకు దిగడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలు ఎదురవుతుండడంతో యూరియా పంపిణీ వ్యవహారంపై పోలీసు శాఖ దృష్టి సారించింది. స్వయంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ గూడూరు మండల కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. సొసైటీ గోదాము వద్ద యూరియా కోసం వచ్చిన రైతులతో మాట్లాడారు. అలాగే గోదాములో స్టాక్ ఉన్న ఎరువులను పరిశీలించారు.

ఇబ్బందులు లేకుండా, వచ్చిన యూరియాను కచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ డీలర్లకు వచ్చిన యూరియాను కూడా సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. యూరియా పంపిణీలో ఎలాంటి అవకత అవకలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ దృష్టి పెట్టిందని, రైతులు కాస్తా సంయమనం పాటించాలని, అధికార వర్గాలకు సహకరించాలని ఎస్పీ కోరారు. 1200 బస్తాలను రైతులకు పంపిణీ చేయించారు. అలాగే మరో 300 మందికి పైగా రైతులకు టోకెన్లు ఇప్పించారు. ఎస్పి వెంట డిఎస్పి తిరుపతిరావు, పిఎసిఎస్ చైర్మన్ చల్ల లింగారెడ్డి, తహసిల్దార్ నాగ భవాని, ఏవో అబ్దుల్ మాలిక్ తదితరులున్నారు.