19-08-2025 04:54:56 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామం చెరువు అలుగు వరదలో చేపల వేటకై వెళ్లి వరదకు కొట్టుకుపోయి మృత్యువాత పడిన శివరాత్రి నవీన్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైనది. సోమవారం సాయంత్రం వరదలో కొట్టుకుపోయిన నవీన్ కోసం దాదాపు 15 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. నవీన్ మృతదేహం వరదలో పడిన చోటు నుండి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో చెట్ల పొదల్లో లభ్యమయింది.
మృతదేహాన్ని గ్రామస్తులు, పోలీస్, రెవెన్యూ, ఎస్డిఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. మృతదేహం కోసం స్థానిక ఎస్సై యుగంధర్ గౌడ్, తహసిల్దార్ దశరథ 15 గంటలపాటు రాత్రి నుండి తెల్లవారి వరకు నిరంతర పర్యవేక్షణతో ఎస్డిఆర్ఎఫ్, ఫైర్, గ్రామస్తుల సమన్వయం, సహకారంతో మృతదేహాన్ని బయటకు తీసుకు వచ్చినందుకు వారిని ప్రజలు అభినందించారు.