19-08-2025 05:22:51 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో సాగుకు అవసరమైన యూనియన్ కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం వల్లే, యూరియా కొరత ఏర్పడిందని, యూరియా కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఢిల్లీలో ధర్నాలు కూడా చేపట్టారని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని, సంఘ ధాన్యానికి రూ.500 బోనస్, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ కార్యక్రమాలను అమలు చేస్తూ రైతులకు అండగా ఉండడాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని ఆరోపించారు. రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా వానకాలం సీజన్లో సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 5.32 లక్షల టన్నుల యూరియా మాత్రమే పంపిణీ చేసిందని ఆరోపించారు. దీనితో ప్రస్తుతం యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి రైతులకు ఇబ్బంది లేకుండా అవసరమైన యూరియాను కేటాయించాలని డిమాండ్ చేశారు.