దమ్మపేటలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా యాత్ర’
దమ్మపేట, ఆగస్టు 13,(విజయక్రాంతి): దమ్మపేట మండల కేంద్రంలో ‘హర్ ఘర్ తిరంగా యాత్ర‘ను కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గొట్టిపూళ్ళ దుర్గా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. ‘మన జెండా - మన గర్వం - మన భారతం‘ అనే నినాదంతో దమ్మపేట వీధుల్లో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గొట్టిపూళ్ళ దుర్గా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక గొప్ప దేశభక్తి కార్యక్రమమే ‘హర్ ఘర్ తిరంగా’ (ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం) అని తెలిపారు.
దేశ పౌరులందరిలో జాతీయభావన, ఐక్యతను పెంపొందించడం మరియు జాతీయ జెండాతో ప్రతీ ఒక్కరి బంధాన్ని మరింత బలోపేతం చేయడం ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశమని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశభక్తిని, జాతీయ ఐక్యతను, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
మన దేశ గౌరవానికి, మన భాగస్వామ్యానికి సంకేతమైన ఈ తిరంగా యాత్రలో మండల ప్రజలు, యువకులు, నాయకులు మరియు కార్యకర్తలు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని మహోద్యమంగా మార్చి జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో మువ్వన్నెల జెండాలు చేతబూని ‘భారత్ మాతాకీ జై‘ అనే నినాదాలతో దమ్మపేట పురవీధులు మారుమోగాయి.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉడతనేని విశ్వేశ్వరరావు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నాగుల చందు, మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగరాజు, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు కొరస వీరభద్రం, మండల సెక్రటరీ సూరే మల్లికార్జున్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు సొరకాయల సీతారాములు, లక్కాకుల ప్రశాంత్, గంగిశెట్టి ప్రసాద్, దొడ్డ సతీష్, పసుమర్తి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.






