29-01-2026 02:48:48 PM
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్షను ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ ను టచ్ చేయడమంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అన్నారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ పై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమే అన్నారు. ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు.సింగరేణి కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అంటూ ఫైర్ అయ్యారు.
ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్.. ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అంటూ హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం శాశ్వతం కాదు, అహంకారం అంతకంటే కాదని సూచించారు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉందని తెలిపారు. రేవంత్ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదన్న హరీశ్ రావు ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.