05-09-2025 12:00:00 AM
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి)వెల్దండ/కల్వకుర్తి రూరల్: కన్నబిడ్డలపై ఓ తండ్రి కర్కశం చూపాడు. పదేళ్లలోపు ముగ్గురు పిల్లలను చంపి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత తానూ పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు. తన భార్య నెరుపుతున్న వివాహేతర సంబంధమే దీనంతటికీ కారణం అని తెలుస్తోంది.
ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగుంట్లపాలెం మండలం బోయలపల్లి గ్రామానికి చెందిన గుప్త వెంకటేశ్వర్లు(36), అదే గ్రామానికి చెందిన దీపిక పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తెలు మోక్షిత(8), రఘు వర్షిణి (6), కుమారుడు శివధర్మ (4) ఉన్నారు.
వెంకటేశ్వర్లు ఫర్టిలైజర్ దుకాణం నడుపుతూ.. గ్రామంలో ఉన్నతమైన స్థాయిలో జీవనం సాగిస్తున్నాడు. తన భార్య దీపిక గత కొద్ది నెలల క్రితం మహిళా సంఘంలో లీడర్‌గా ఎదిగింది. మహిళా సంఘాల సభ్యులకు రుణాలు మంజూ రు కోసం తరచూ బ్యాంకుకు వెళ్తూ వచ్చేది. ఈ క్రమంలో బ్యాంకు ఉద్యోగితో ఏర్పడిన చనువు వివాహేతర సంబంధానికి దారితీసింది.
దీంతో గత కొన్ని నెలలుగా భర్త, పిల్లలను పట్టించుకోవడంలేదు. వెంకటేశ్వర్లు పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అయినా దీపికలో మార్పు రాలే దు. విసిగుచెందిన వెంకటేశ్వర్లు గత నెల 30న తన పిల్లలు బడి నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో తానే వెదురుగా వెళ్లి బైక్‌పై ఎక్కించుకొని శ్రీశైలం నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలోకి ప్రవేశించాడు. అనంతరం విగతజీవిగా బుధవారం వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో లభ్యమయ్యాడు.
స్థానికుల సహాయంతో పోలీసులు సమాచారం అందుకుని విచారించగా బైక్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో కలిసి నాలుగు రోజుల క్రితమే బయలుదేరాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో నాగర్‌కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి డ్రోన్, సీసీ ఫుటేజీల ఆధారంగా చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
గురువారం కాలిపోయిన స్థితిలో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం ఉప్పునుం తల మండలం పరిధిలోని వెల్టూరు గ్రామ సమీపంలో ఉన్న గుట్ట ప్రాంతంలో రఘు వర్షిణి, శివధర్మ మృతదేహాలు లభ్యమవ్వగా.. మధ్యాహ్నం కుట్ర గ్రామ సమీపంలోని ఓ ముళ్ల పొదల్లో మోక్షిత(8) మృతదేహం లభ్యమైంది. ముగ్గురిని అతి దారుణంగా హతమార్చి, పెట్రోల్ పోసి తగులబెట్టిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసు పత్రికి తరలించి, అనంతరం బంధువులకు అప్పగించారు.