01-02-2026 01:00:21 AM
తొంభై నాలుగేళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు సింగీతం శ్రీనివాసరావు. స్థానిక కథలు చెప్పే ఫిలిం మేకర్‌గా, వినూత్న ప్రయోగాలకు కేరాఫ్‌గా పేరున్న లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుతో వస్తున్నారు. నాగ్‌అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898ఏడీ’ చిత్రానికి క్రియేటివ్ సహకారం అందించిన తర్వాత, ఇప్పుడు సింగీతం స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ‘ఎస్‌ఎస్‌ఆర్61’ను తెరకెక్కిస్తున్నారు.
ఈ కొత్త సినిమాను శనివారం పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియోలో సింగీతం క్రియేటివిటీ, ఆయన సినిమాలపై ఉన్న ప్రేమ, తరతరాల దర్శకులపై ఆయన ప్రభావాన్ని గుర్తు చేసే క్లిప్స్ ఆకట్టుకున్నాయి. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’ లాంటి క్లాసిక్స్‌ను మరోసారి గుర్తు చేశాయి. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్‌అశ్విన్ నిర్మిస్తున్నారు.
అనుభవం, ఆధునిక ఆలోచనలు కలగలిసిన ఈ కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింగీతం కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా అభివర్ణించింది వైజయంతి మూవీస్. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌తోపాటు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.