01-01-2026 01:00:05 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 31 (విజయక్రాంతి): కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే నిర్మాతలకు కన్నీళ్లు తెప్పించిన, టాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్లకు గండికొట్టిన పేరుమోసిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ వెనుక ఉన్నది ఒక కార్పొరేట్ తరహా నెట్‌వర్క్ అని పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి రవిని 12 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు.. అతడి అక్రమ సామ్రా జ్యానికి సంబంధించిన విస్తుపోయే నిజాలను కోర్టు ముం దు ఉంచారు.
పోలీసులు సమర్పించిన కస్టడీ రిపోర్ట్‌తో రవి ఆపరేషన్, మనీలాండరింగ్, విదేశీ లింకుల చిట్టాను బయటపెట్టారు.రవి ఈ దందాను ఒంటరిగా నడపలేదు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 10 మంది యువకులతో ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, ఉషాముల్లపూడి ఆసుపత్రి సమీపంలో ఒక ఆఫీసును గుట్టుచప్పుడు కాకుండా నడిపించాడు. ఇక్కడి నుంచే సర్వర్లను ఆపరేట్ చేస్తూ, విదేశాల్లో ఉన్న రాకేష్ అనే వ్యక్తి సాయంతో వెబ్‌సైట్ డొమైన్లను మారుస్తూ పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు.
రాకేష్ ద్వారానే వెబ్‌సైట్‌కు ట్రేడ్ మార్క్ లైసెన్స్ పొందడం గమనార్హం.కొత్త సినిమా థియేటర్లో పడటమే ఆలస్యం.. రవి టీమ్ రంగం లోకి దిగేది. థియేటర్ల నుంచి పైరసీ కాపీలను సేకరించేందుకు ఒక నెట్‌వర్క్ ఉండేది. థియేటర్‌లో రహస్యంగా రికార్డ్ చేసిన క్యామ్ ప్రింట్ కోసం రవి 100 డాలర్లు చెల్లించేవాడు. సినిమా రిలీజైన కొద్ది రోజులకే వచ్చే హెచ్‌డీ ప్రింట్ కోసం 200 డాలర్లు చెల్లించేవాడు.
కోవిడ్ సమయంలో థియేటర్లు మూతపడటం, ప్రజలు ఓటీటీ,ఆన్‌లైన్ వీక్షణకు అలవాటు పడటాన్ని రవి క్యాష్ చేసుకున్నాడు. ఆ సమయంలోనే తన బిజినెస్ వంద రెట్లు పెరిగిందని రవి అంగీకరించాడు.బెట్టింగ్ యాడ్సే బంగారు గుడ్లు...ఐబొమ్మ సైట్‌లో సినిమా చూసేటప్పుడు స్క్రీన్ నిండా వచ్చే బెట్టింగ్ యాడ్స్ ద్వారానే రవి కోట్లు గడించాడు. కేవలం ఒకే ఒక్క బెట్టింగ్ కంపెనీ నుంచి యాడ్స్ రూపంలో రూ.1.78 కోట్లు రవి ఖాతాలోకి వచ్చాయంటే ఈ దందా స్థాయిని అర్థం చేసుకోవచ్చు.
పన్ను ఎగ్గొట్టేందుకు సిస్టర్ సెంటిమెంట్..
అక్రమంగా వచ్చిన డబ్బుపై ఇన్కమ్ టాక్స్ కన్ను పడకుండా ఉండేందుకు రవి తెలివిగా వ్యవహరించాడు. తన సొంత సోద రి చంద్రిక ఖాతాను బినామీగా వాడుకున్నాడు. ఆమె ఖాతాలోకి విడతల వారీగా రూ.90 లక్షలు మళ్లించాడు. ఈ డబ్బుతో రవి విలాసవంతమైన జీవితం గడిపాడని, ఖరీదైన కార్లు, జల్సాలకు ఖర్చు చేశాడని పోలీసులు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
ముగిసిన కస్టడీ.. జైలుకు రవి..12 రోజుల విచారణ అనంతరం రవిని తిరిగి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి, జైలుకు తరలించారు. అయితే ఈ రాకెట్‌లో విదేశాల్లో ఉన్న రాకేష్ పాత్ర, లోకల్‌గా సహకరించిన థియేటర్ సిబ్బంది, టెక్నికల్ టీమ్ వివరాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
అక్కౌంట్ల నిండా విదేశీ కరెన్సీనే..
రవికి చెందిన 7 ప్రధాన బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేసి పరిశీలించారు. ఇందులో మొత్తం రూ. 13.40 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇందులో అత్యధికం విదేశీ కరెన్సీ డాలర్లు, యూరోలు రూపంలోనే ఉం డటం విశేషం. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘనలు జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు, ఈ కేసు సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు కూడా అందించే అవకాశం ఉంది.