21-08-2025 06:23:08 PM
వలిగొండ (విజయక్రాంతి): ఇటీవల కురుస్తున్న అకాల వర్షాల కారణంగా వలిగొండ మండలంలో ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి(CPM Mandal Secretary Sirpangi Swamy) డిమాండ్ చేశారు. గురువారం వర్కట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ ను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇదే రకంగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంత గ్రామాలుగా ఉన్న అన్ని గ్రామాల్లో ముందస్తుగా హెల్త్ క్యాంపులు నిర్వహించి సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియాతో పాటు ఇతర వ్యాధుల బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా అన్ని గ్రామాల్లో దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ తో పాటు ఇతర మందులను స్ప్రే చేయాలని అన్ని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వ నుండి నిధులు కేటాయించి ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే స్పందించిన వర్కట్ పల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ తో పాటు మిగతా సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.