calender_icon.png 1 May, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు అందిన ఆరోగ్యం

30-04-2025 12:00:00 AM

నేడు ఆయుష్మాన్ భారత్ దివస్

‘ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన’లో భాగం గా కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రవేశ పెట్టింది. దీంతో పేద బడు గు బలహీన వర్గాల ప్రజల వైద్య ఆరోగ్య పరిరక్షణకు సకాలంలో చర్యలు తీసుకున్నట్లయింది. 2018 ఏప్రిల్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం నేడు లక్షలాది మంది భారతీయ అట్టడుగు వర్గాల ప్రజలకు అతితక్కువ ఖర్చుతో ఆరోగ్య సేవలు అందించే వరంగా మారింది. ఐరాసా (ఐక్యరాజ్యసమితి) నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భాగంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం పేదల పక్షపాత పథకంగా గత ఏడేళ్లుగా కొనసాగుతున్నది. రాజకీయాలకు అతీతంగా సమ్మిళిత వైద్యం, ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా కొనసాగుతున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అన్ని రాష్ట్రాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలు తెలుసుకోవాలి.

అందరికీ అందుబాటులో వైద్యం, ఆరోగ్యం అనే నినాదంతో ప్రారంభమైన ఈ పథకం పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం, అట్టడుగు వర్గాల వారికి దీనిద్వారా ఆరోగ్య గొడుగు పట్టడం, ఆయుష్మాన్ కార్డులను అర్హతగల కుటుంబాలకు అందజేయడం వంటి లక్ష్యాలను అమలు చేయడానికి ఏటా ఏప్రిల్ 30న ఆయుష్మాన్ భారత్ దివస్‌ను నిర్వహించుకుంటు న్నాం. రెండు వారాలపాటు ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాలను జరుపుకోవడం 2019 నుంచి ఆనవాయితీగా వస్తున్నది.

2025 ఆయుష్మాన్ భారత్ దినోత్సవ ఇతివృత్తంగా ‘అందరికీ ఆరోగ్య సురక్ష అట్టడుగు వర్గాలకు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం’ అంశాన్ని తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి ప్రజలను తీసుకు రావడానికి, అందరినీ చేర్చడానికి విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అభాగ్యులను ఈ పథకంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు పథకానికి మధ్యన నెలకొన్న దూరాన్ని తగ్గించేందుకూ ప్రభుత్వం కృషి చేస్తున్నది. 

ఆరోగ్యకర జీవితం కనీస మానవ హక్కు అని, అది విలాసం కాదని గుర్తించిన కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పేద కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డులు జారీ చేయడం, వైద్యఖర్చులను భారీగా తగ్గించడం, గ్రామీణ వైద్య సిబ్బందిని ప్రోత్సహించడం చేస్తున్నది. ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తూ పేదల నమ్మకాన్ని గెలుచుకోవడం సంతోషకరమైన విషయం. అట్టడుగు వర్గాలకు చెందిన 55 కోట్ల మంది లబ్ధిదారులను ఈ పథకం కిందకు ప్రభుత్వం తీసుకురావడం గొప్ప విషయం.

దేశవ్యాప్తంగా 5 లక్షల కుటుంబాలకు దాదాపు 40 కోట్ల ఆయుష్మాన్ కార్డులను అందజేయంతోపాటు 31,846 ఆసుపత్రుల ద్వారా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. కీళ్ల మార్పిడి, బైపాస్ సర్జరీ లాంటి వైద్య చికిత్సలు కూడా ఇందులో చేర్చడం అభినందనీయం. ఆయుష్మాన్ భారత్ దివస్‌లో భాగంగా వైద్య శిబిరాలు, ఆరోగ్య విద్య సెమినార్ల ద్వారా గ్రా మీణ స్థాయివరకు ఈ పథకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.  

- డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి