30-04-2025 12:00:00 AM
సరైన వ్యక్తికి సరైన ప్రేరణను, శిక్షణను ఇవ్వాలే కాని అర్హత లేని వారికి ఇవ్వడం వల్ల ఫలితం వ్యర్థమవుతుంది. గుర్రాన్ని నడిపే రౌతుకు ఉన్నత శ్రేణి శిక్షణను, ప్రేరణను ఇచ్చినంత మాత్రాన అతడు ఉత్తమ రౌతు అవుతాడే కాని గుర్రం ఉత్తమాశ్వంగా మారదు. అందుకే సుముఖత, సన్నద్ధత కలిగిన సరైన వ్యక్తులను ఎన్నుకొని వారికి అవసరమైన శిక్షణను, ప్రేరణను అందివ్వాలి.
విద్యావినీతో రాజాహి
ప్రజానాం వినయే రతః
అనన్యాం పృథివీం భుంక్తే
సర్వ భూత హితేరతః ॥
కౌటిలీయం: (1.-5)
“స్వయంగా తాను విద్యలలో శిక్షితుడై, సకల భూతాలకు హితాన్ని చేయడంలో ఆసక్తి కలిగి, ప్రజలకు శిక్షణ ఇవ్వడంలో శ్రద్ధ గలిగిన రాజు ఏకచ్ఛత్రాధిపత్యం సాగిస్తాడు” అంటాడు చాణక్య. కార్యనిర్వహణ లో సమస్యలు రావడం సహజం. బుద్ధి ఉపయోగించి ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేవాడే నాయకునిగా గుర్తింపు పొందుతాడు. పరిష్కారం అనేది అంతిమ ఫలితం. పరిణతి కలిగిన నాయకుడు బృందానికి ఆత్మవిశ్వాసాన్ని, సభ్యులమధ్య పరస్పర విశ్వాసాన్ని ఇవ్వాలి. అప్పుడు టీమ్ (బృందం) పోటీ పడగల సంతులిత స్థాయికి పరివర్తన చెందుతుంది. నాయకుని ప్రతిభ బృందసభ్యుల ను సాధికారులుగా తీర్చిదిద్దడంలోనూ, వారి ఎదుగుదలకు చేయూత ఇవ్వడంలోనూ ఉంటుంది. అనంత అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన క్రమంలో పరిమితమైన తన అవగాహనయే అంతిమమని భావించే నాయకుడు ఉన్నస్థితికే పరిమితమౌతాడు.
సౌకర్యవంతమైన వలయాలను ఛేదించుకొని తామిది వరకు తెలియని ప్రాంతాలలో, రంగాలలో ఉన్న అవకాశాలను అన్వేషించడంలో ప్రమాదాలు, అప జయాలు పొంచి వుండవచ్చు కాని అక్కడే ఎవరూ వూహించని విజయద్వారాలూ తెరచుకొని అహ్వానిస్తుంటాయి. తెలియని ప్రపంచంతో చేసిన చెలిమి నాయకులకు నేర్చుకునేందుకు అవకాశాన్నిస్తుంది. ఊహాతీత విజయాలనూ అందిస్తుంది. సాధనే జీవితమనే సత్యాన్నీ, సాధించాలనే ఉత్సాహాన్ని, తపనను అది అనునిత్యం విస్తృత పరుస్తుంది. ఈ ప్రక్రియలో విజయమైనా, అపజయమైనా ఆనందంగా ఆస్వాదించే మానసిక చైతన్యం నాయకునిలో ఉత్తేజితమవుతుంది.
పరిమిత జ్ఞానం, నైపుణ్యం కలిగిన వ్యక్తి తాను సాధించిన విజ్ఞానాన్ని ఇతరులు వాడుకుంటే బాధ పడతాడు. కాని ఆత్మవిశ్వాసం, పరిణతి కలిగిన నాయకుడు ఇతరుల ఎదుగుదలనూ ఆహ్వానిస్తాడు. నాయకుని లోతైన ఆలోచనా సరళి ఇలా విస్తృతిని సంతరించుకున్నప్పుడు ఆనందభరిత విజయం బృందానికి లభిస్తుంది. బృంద పరిమాణం కన్నా ప్రమాణాలను పెంచగలిగిన నాయకుడు సంస్థ విజయావకాశాలను బహుముఖీనంగా విస్తరింప చేయగలుగుతాడు. అలాంటి నాయకులు తాము పక్కన వుండి బృందసభ్యులు ఎదిగే అవకాశాలను అందుకునేందుకు ప్రేరణనిస్తారు. ప్రయత్నశీలికి విజయం అపజయం రెండూ సాపేక్షాలే. నిజానికి వాటిమధ్య ఉన్న సంబంధం సున్నాకు అనంతానికి నడిమి బంధం వలె భావించవచ్చు.
అనంతం అంటే లెక్క పెట్టలేనంత అనుకుంటాం కాని అలాకాదు, చాలా ఎక్కువ అని మాత్రమే అర్థం. అలాగే సున్నా అంటే చాలా తక్కువ మాత్రమే కాని ఏమీ లేకపోవడమూ కాదు. అందుకే, విజయం అనంతం, సున్నా అపజయం. అప్పుడు విజయమా అపజయమా అనేది సందర్భాన్నిబట్టి నిర్ధారితమవుతుంది. చేసిన ప్రయత్నానికి ఫలితం ఉంటుంది కాబట్టి ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితం లభిస్తే విజయం, తక్కువ ఫలితం లభిస్తే అపజయంగా పరిగణించవచ్చు.
సరైన వ్యక్తికి సరైన ప్రేరణ
వ్యాపార రంగంలో అత్యంత ముఖ్యమైంది లేదా మౌలికమైంది ఒకటుంటుం ది. ఆరంభంలో ప్రభావవంతంగా, క్రియాశీలకంగా కనిపించేది కాలావధిలో నిష్ప లంగా, అసమర్థంగా, అనైతికమైందిగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. అలాంటి వాటికి విలువలను జోడించడం కష్ట సాధ్యమైన పని. ప్రత్యామ్నాయంగా బృం దంలో నిన్నటి ఉత్పాదకతమీద నేటి ఉ త్పాదకత ఎంతగా పెంచుకోగలిగామో అంచనా వేసుకోవాలి. అప్పుడు ఉన్నత ప్రమాణాలతో ఫలితాల ఆవిష్కరణ మరిం త సులువవుతుంది. దీనికి అవసరమైంది బృందసభ్యులలో సన్నద్ధత. ఇందుకు కొలమానంగా, సభ్యులు లక్ష్యాలను అధిగమించేందుకు ఏ మేరకు సుముఖత వ్యక్తప రుస్తున్నారు, వారి సామర్థ్యం ఎంత అనేది ప్రధానాంశం.
బృందసభ్యులు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు సుముఖులుగా లేకపోవడం, వారిలో అవసరమైన సామ ర్థ్యం లోపించడం వంటి వాటివల్ల ఆశించిన ఫలితాలను ఆవిష్కరించలేం. కారణం ఆత్మవిశ్వాసం లేకపోవడమే. ఒక్కోమారు వారిలో సామర్థ్యం ఉంటుంది కాని ఆ లక్ష్యాలను ఛేదించేందుకు ఇష్టపడరు. కారణం స్వతహాగా, స్వతంత్రంగా పని చేయడానికి సాహసించ లేకపోవడమే.
అలాంటి వారికి సరైన ప్రేరణను అం దిస్తే వారు కార్యసాధకులుగా నిలుస్తారు. కొందరిలో సుముఖత ఉంటుంది కాని సామర్థ్యం ఉండదు. వారికి ఆ నైపుణ్యాలను సాధించేలా ప్రేరణను, శిక్షణనూ ఇవ్వాలి. కొందరు మాత్రం ఎంత పెద్ద లక్ష్యాలను ఏర్పరచినా వాటిని ఛేదించేందుకు సన్నద్ధతను, సామర్థ్యాన్ని కలిగివుం టారు. ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో, నిబద్ధతతో, సంయమనంతో, సమన్వయంతో కార్యాన్ని సాధిస్తారు. అలాంటి వారికి అవసరమైంది గుర్తింపు. వారిని సముచితంగా గుర్తించి బాధ్యతలను అప్పగించడం వల్ల వ్యాపార విస్తృతికి మరిం తగా ఉపయోగపడతారు.
అయితే ఒక్క విషయాన్ని ఇక్కడ నాయకుడు విస్మరించరాదు. సరైన వ్యక్తికి సరైన ప్రేరణను, శిక్షణను ఇవ్వాలే కాని అర్హత లేని వారికి ఇవ్వడం వ్యర్థమవుతుంది. గుర్రాన్ని నడిపే రౌతుకు ఉన్నత శ్రేణి శిక్షణను, ప్రేరణను ఇచ్చినంత మాత్రాన అతడు ఉత్తమ రౌతు అవుతాడే కాని గుర్రం ఉత్తమాశ్వంగా మారదు. అందుకే సుముఖత, సన్నద్ధత కలిగిన సరైన వ్యక్తులను ఎన్నుకొని వారికి అవసరమైన శిక్షణను, ప్రేరణను అందివ్వాలి. బృందసభ్యులలో అప్పగించిన పనిపట్ల గౌరవం కలిగిన వ్యక్తులను ఎన్నుకోక పోతే కార్యభంగం కావడమే కాక క్రమశిక్షణ లోపించి సంస్థ గౌరవం తగ్గిపోయే ప్రమాదమూ ఉంటుంది. అలాంటి వ్యక్తులను వీలైనంత త్వరగా గుర్తించి తొలగించుకుంటేనే సంస్థకూ, అధినాయకునికీ మంచిది.
-పాలకుర్తి రామమూర్తి