27-09-2025 02:41:55 PM
పొంగి ప్రవహించిన వాగులు.. నిలిచిన రాకపోకలు..
టేకులపల్లి, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో శనివారం కుండపోతగా వర్షం(Heavy rain) కురిసింది. శుక్రవారం రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురియగా, శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కుండపోతగా కురిసింది. దీనితో వాగులు, వర్రెలు పొంగి ప్రవహించి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుర్పుగూడెం మీదుగా రైల్వే స్టేషన్ బేతంపూడి వెళ్లే మార్గంలోని రాళ్లవాగు పొంగి ప్రవహించడంతో మూడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రోళ్లపాడు - ప్రధాన రహదారి మధ్యలో ఉన్న మూడు వంకల వాగులు పొంగి రోళ్లపాడు, రుక్మతండా, బీల్యాతండా గ్రామాల ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పుణ్యపువాగు పొంగి అనిశెట్టిపల్లి - సంపత్ నగర్ మార్గమధ్యలో రాకపోకలు నిలిచాయి. పాతలచగూడెం - గంగారం గ్రామాల మధ్య ఉన్న ముర్రేడు వాగు పొంగి అక్కడకూడా రాకపోకలు నిలిచాయి. రాళ్ళవాగు, పెద్దవాగు, మద్దిరాలవాగు, ముర్రేడు ఇతర వాగులు పొంగాయి. మండలంలోని సింగరేణి కోయగూడెం ఉపరితల గనిలో మట్టి, బొగ్గు తీసే పనులకు అంతరాయం ఏర్పడింది. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లిలో ప్రతి శనివారం నిర్వహించే వారాంతపు పశువుల సంత వర్షంతో వెలవెల పోయింది. పత్తి, మొక్కజొన్న పంటలకు వర్షాలతో తీవ్ర నష్టం ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.