06-07-2025 12:40:56 AM
పలు చిత్ర పరిశ్రమల్లో ఆసక్తిగా మారిన వారసుల తెరంగేట్రం
ఏ రంగంలోనైనా వారసుల పరంపరం కొనసాగుతూనే ఉంటుంది. అయితే, చిత్ర పరిశ్రమల్లోకి కొత్తగా ఎవరి వారసులొస్తున్నారనేది ఎప్పుడూ ఆసక్తికరమే. ఇటీవల పలు చిత్ర పరిశ్రమల్లో నటవారసులు పలుకరించగా.. మరికొందరు తెరంగేట్రానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో కొందరు వారసుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ నెపో కిడ్స్ గురించే ఈ కథనం..
కన్నప్ప’తో మంచు విష్ణు సంతానం..
మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటించి ‘కన్నప్ప’ ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాతో మంచు కుటుంబానికి చెందిన మరో తరం తెరపై మెరిసింది. మోహన్‌బాబు మనవడు, విష్ణు కొడుకు అవ్రామ్ ఆరేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమాలో బాల తిన్నడుగా కనిపించిన అవ్రామ్ ప్రేక్షకుల జేజేలందుకున్నాడు. ఇదే సినిమాలో విష్ణు ముగ్గురు కూతుళ్లు కూడా తెరపై సందడి చేశారు. కవలలైన అరియానా, వివియానా శ్రీకాళహస్తి విశిష్టతను తెలిపే పాటతో అలరించగా, రెండున్నరేళ్ల చిన్నారి అయ్రా విద్య ‘తాతా తిన్నడి కథ చెప్పవా..’ అన్న ఒకే ఒక్క మాటతో వెండితెర ప్రేక్షకులను పలుకరించింది.
బాలకృష్ణ కొడుకు కోసం ఎదురుచూపులు
బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. నందమూరి వంశం నుంచి వస్తున్న మూడో తరం నటుడైన మోక్షజ్ఞ తెరగేట్రం గురించి గత జూలైలో ప్రకటించారు. 30 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇస్తున్న నటుడిగా ఆసక్తికర చర్చకు కారణమైన ఈ యువకుడు ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో చేస్తున్న ‘సింబా’ అనే సినిమా ఆగిపోయిందనే చర్చ జరుగుతోంది. ప్రశాంత్‌వర్మ ఈ చిత్రాన్ని మధ్యలోనే వదిలేసి వేరే సినిమా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
నందమూరి నాలుగో తరం కూడా..
నందమూరి వంశం నుంచి మరో యంగ్ హీరో రాబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అన్న జానకీరామ్ కుమారుడి పేరు నందమూరి తారక రామారావు. నటుడు నందమూరి హరికృష్ణ మనవడైన ఈ 19 ఏళ్ల యువకుడు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందుకు సంబంధించిన సినిమా ప్రారంభోత్సవం ఇటీవల ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిర్వహించారు. ఈ చిత్రానికి వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. యలమంచలి గీతా ఎన్టీఆర్ (న్యూ టాలెంట్ రోర్స్) బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే సినిమాతో వీనా రావు అనే తెలుగమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.
కృష్ణ మనవడు జయకృష్ణ..
దివంగత కృష్ణ ఐదు దశాబ్దాలకు పైగా సినీరంగానికి తన సేవలు అందించారు. ఆయన బాటలో కుమారులు మహేశ్‌బాబు, రమేశ్‌బాబుతోపాటు నరేశ్ వీకే తెరంగేట్రం చేశారు. కూతురు మంజుల, చిన్నల్లుడు సుధీర్‌బాబుతోపాటు మనవడు అశోక్ గల్లా హీరోగా లాంచ్ అయ్యారు. మహేశ్ తనయుడు గౌతమ్ బాల నటుడిగా పరిచయమయ్యాడు.
తాజాగా ఈ వంశం నుంచి మరో హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చదువు పూర్తి చేసుకుని, సినిమాల మీద ఆసక్తితో నటనలో శిక్షణ తీసుకున్నాడు. జయకృష్ణను ‘ఆర్‌ఎక్స్100’ ఫేమ్ అజయ్ భూపతి పరిచయం చేయనున్నారని ఫిలిం సర్కిళ్లలో వినవస్తున్న మాట.
తమిళంలో ఇద్దరు.. మలయాళంలో ఒకరు
మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ తనయ విస్మయ ‘తుడక్కమ్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఇటీవల ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహన్‌లాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. జుడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్నారు. కథారచనపై ఆసక్తి కనబర్చే విస్మయ సినిమాల్లోకి అడుగుపెడుతుండటంతో మలయాళ సినీవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
మరోవైపు మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్ వరుస చిత్రాలతో అలరిస్తున్నాడు. ఇక తమిళ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్లకు చెందిన కుటుంబాల నుంచి యువ నటులు పరిచయమయ్యారు. విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమైన చిత్రం ‘ఫీనిక్స్’. గతంలో నానుమ్ రౌడీ ధాన్, సింధుబాద్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన సూర్య.. పూర్తిస్థాయిలో హీరోగా నటిస్తున్న తొలిచిత్రమిదే.
ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. విజయ్ ఆంటోని తన మేనల్లుడు అజయ్‌ను ఇటీవల ‘మార్గన్’ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ్ ఆంటోని, జే రామాంజనేయులు నిర్మించారు. జూన్ 27న రిలీజైన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
బాలీవుడ్‌లో ముగ్గురు నటవారసులు..
బాలీవుడ్‌లో ఇప్పుడు ‘సైయారా’, ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’ సినిమాల గురించి ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఈ రెండు సినిమాలు.. ముగ్గురు నటవారసులను పరిచయం చేయబోతుండటమే ఇందుకు కారణం. ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’ చిత్రంతో నటుడు సంజయ్‌కపూర్ కుమార్తె షానయా కపూర్ వెండితెరకు పరిచయమవుతోంది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘అల్విదా’ అనే పాట శనివారం విడుదలైంది. ఇక ‘సైయారా’ చిత్రంతో యువజంట అహాన్ పాండే, అనీత్ పద్దాల ఆరంగేట్రం చేస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తున్న అహాన్ పాండే.. చుంకీ పాండేకు స్వయానా మేనల్లుడు. బాలీవుడ్ నటి అనన్య పాండే ఇతనికి కోడలు అవుతుంది.
సాలూరి వారి సంగీత వారసత్వం..
యువ జంట సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న కొత్త సినిమా ‘ప్రేమిస్తున్నా’. భాను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కనకదుర్గారావు పప్పుల నిర్మాత. ఇదే చిత్రం ప్రముఖ సంగీత కుటుంబం నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిచయం చేస్తోంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ సాలూరి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. సిద్ధార్థ్ ఎవరో కాదు.. సాలూరి రాజేశ్వర్‌రావు కుమారుడు. ఆయన తాత సాలూరి హనుమంతరావు కూడా ఇండస్ట్రీకి సుపరిచితుడే.