14-11-2025 12:00:00 AM
వనపర్తి, నవంబర్ 13 (విజయక్రాంతి ): వీధి వ్యాపా రులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జిల్లా పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ (సీఐజీ) లను ఏర్పాటు చేయాలని మెప్మాకు గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 27 సంఘాలు ఏర్పాటు చేయగా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రతి గ్రూపులో ఐదు నుంచి పది మంది సభ్యులు ఉండేలా చర్యలు చేపట్టారు.
సంఘాల లోని సభ్యులకు శిక్షణ.. ...
ఇప్పటికే వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో 2800 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. వీరితో ఏర్పాటు చేసే గ్రూపుల్లో ఎంపిక చేసిన సంఘాల్లోని సభ్యులకు ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. వారు బ్యాంకు ఖాతాలు తెరిచిన వెంటనే సంఘాల పొదుపు ప్రక్రియను పరిశీలించి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించనున్నారు. ఆరు నెల ల తర్వాత సంఘాలకు మొదటి విడతగా రూ.లక్ష తర్వాత పైన వరకు రుణం పొందేలా ప్రణాళిక రూపొందించారు. వీధి వ్యాపారులు ప్రత్యేకంగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా పీఎం స్వనిధి పథకం కింద దుకాణాలు నిర్మించనున్నారు.
సభ్యులకు బీమా సదుపాయం ..
పొదుపు సంఘంలో సభ్యులుగా చేరిన వ్యాపారులకు బీమా సదుపాయం కల్పించనున్నారు. ప్రమాదవశాత్తు సభ్యులు మృతి చెందితే వారికి బీమా వర్తిస్తుంది. ఈ మేరకు వీధి వ్యాపారులకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో గుర్తింపుకార్డులు అందజేయనున్నారు..
రుణం ఇప్పిస్తాం
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో ఏర్పాటు అయ్యే సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించడానికి కృషి చేస్తున్నాం. దీంతో వారికి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది.
బాలరాజు, మెప్మా జిల్లా కోఆర్డినేటర్