14-11-2025 12:29:43 AM
-కోటా కోసమే బీసీ సంఘాలు, కుల, ఓయూ విద్యార్థుల జేఏసీ పోరాటాలు
-స్థానిక సంస్థల్లో చట్టబద్ధంగానే 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
-పార్టీల పరంగా ఇచ్చి చేతులు దులుపుకొంటే సహించేది లేదు
-16న ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో న్యాయ సాధన దీక్ష
-జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను అడ్డుకుంటే యుద్దమే జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీల ఉద్యమం జోరందుకుందని, బీసీ సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు, ఓయూలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు జరుగుతున్నాయని, ఇక న్యాయవాదుల బీసీల న్యాయ దీక్ష జరుగుతుందని, సకల జనుల సమ్మెతరహాలో మహా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చట్టబద్దంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బర్కత్పురలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సి. రాజేందర్, టి. రాజ్ కుమార్, పగిళ్ల సతీష్ కుమార్, శివ యాదవ్, జక్కుల వంశీకృష్ణ, భీమ్ రాజ్, బాణాల అజయ్ తదితరులు హాజరైయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం జారీచేసిన జీవోకు రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత ఉన్నదని, న్యాయపరమైన అవరోధా లు లేవని, న్యాయస్థానాల్లో కేసు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-డి6 ప్రకారం స్థానిక సంస్థలోని బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చిందని, అసెంబ్లీ చట్టం చేశారని, జీవో తీసి వెంటనే ఎన్ని కలు జరపవచ్చన్నారు.
స్థానిక సంస్థల రిజర్వేషన్లు విషయంలో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బీసీలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చా యి కానీ, ఆ రాష్ట్రాల్లో బీసీలు తిరగబడలేదన్నారు. కానీ మన రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల రక్షణ కోసం రాష్ట్ర బంద్ జరపడం గర్వించదగిందన్నారు. ఇది మన రాష్ట్రంలోని బీసీల చైతన్యానికి ప్రతీక అన్నారు.
గత నెల 18న జరిగిన బంద్ తో నైనా ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలు కళ్ళు తెరవాలని, బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లకు కల్పించే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిం చడానికి రాజ్యాంగ సవరణ జరగాలని డి మాండ్ చేశా రు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని విజ్ఞప్తి చేశారు.
బీసీ రిజర్వేషన్ల సాధనకై ఈనెల 16న ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో న్యాయ సాధ న దీక్షను చేపడుతున్నట్లు వెల్లడించారు. బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీ లను మోసం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.