16 August, 2026 | 2:23 AM

ఉన్నత విద్య డ్రాపౌట్

16-08-2026 12:00 AM

అందరికీ నాణ్యమైన విద్య అందాలన్నది మన రాజ్యాంగ మౌలిక సూత్రం. అందుకు అనుగుణంగానే మన దేశంలో ప్రాథమిక స్థాయిలో నిర్బంధ విద్యావిధానం అమల్లో ఉన్నది. కానీ, ఈ ఆశయానికి విరుద్ధంగా పాఠశాల స్థాయిలోనే గణనీయంగా డ్రాపౌట్లు నమోదవుతుండటం ఆందోళనకరం. విద్యార్థుల్లో సుమారు 73 శాతం ఉన్నత విద్య అభ్యసించకుండానే చదువులకు దూరమవుతున్నారని పార్లమెంటరీ కమిటీ నివేదించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.

అయితే, పిల్లలు మధ్యలోనే చదువులు మానేయడానికి విద్యావ్యవస్థలోని లోపాలతో పాటు కుటుంబ సంబంధిత కారణాలూ ఉన్నట్టు తెలుస్తున్నది. కుటుంబపరమైన కారణాల విషయానికి వస్తే, తమ పిల్లలు కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలవాలని ఆశిస్తున్న పేదలు వారిని ఉపాధిబాట పట్టిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇంటి పనులు బాలబాలికల పట్ల పెనుశాపంగా మారుతున్నాయని చెప్పక తప్పదు.

ఉన్నత విద్యావంతులైనప్పటికీ ఉద్యోగం దొరుకుతుందన్న భరోసా లేకపోవడమే దీనంతటికి ప్రధాన కారణం. ప్రాథమిక, మాధ్యమిక విద్య పూర్తిచేసుకున్నాక ఉన్నత పాఠశాలలు, కళాశాలలు అందుబాటులో లేకపోవడం మరో సమస్య. పాఠశాలల విలీనాలు, మూసివేత ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి అడ్డంకిగా మారుతున్నాయి. అదే సమయంలో వసతుల లేమి పాఠశాలలను తీవ్రంగా వెంటాడుతున్నది.

విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక వసతుల్లో కొంతవరకు మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, ఉపాధ్యాయులు, గ్రంథాలయాలు, కంప్యూటర్లు వంటి వసతుల కల్పన పూర్తిస్థాయిలో జరగలేదనే చెప్పాలి. కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాలు అందుబాటులోకి లేకపోవడమూ విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నది. తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కొత్త పుస్తకాల సరఫరాలో జాప్యాన్ని పార్లమెంటరీ కమిటీ ప్రస్తావించడం దీనికి ప్రత్యక్ష తార్కాణం.

వాస్తవానికి జీడీపీలో 6 శాతం విద్యపై ఖర్చు పెట్టాలని యూనెస్కో సిఫారసు చేస్తున్నది. అయితే, మన దేశంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జీడీపీలో కేవలం 4.1 శాతం ఖర్చు చేస్తుండటం శోచనీయం. విద్యతోనే అణగారిన వర్గాల వికాసం సాధ్యమవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఒక విద్యార్థి మధ్యలోనే చదువు మానేయడమంటే ఓ పేద కుటుంబ అభ్యున్నతి కుంటుపడినట్టే. ఈ నేపథ్యంలో భావిభారతం బాగుండాలంటే కలవరపెడుతున్న డ్రాపౌట్ల సమస్యను పరిష్కరించి, విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.