16 August, 2026 | 2:28 AM

అభినవ పోతన వానమామలై

16-08-2026 12:00 AM

నేడు వానమామలై వరదాచార్యులు జయంతి :

ప్రముఖ సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం మడికొండ గ్రామంలో 1912, ఆగస్టు 16న జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన వానమామలై వరదాచార్యులు ఏడో తరగతి వరకే చదువుకున్నారు. అయినప్పటికీ, సాహిత్యంపై తనకున్న మక్కువతో సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించారు. అంతేకాదు అనతికాలంలోనే సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లిషు భాషల్లో ఆయన పట్టు సాధించారు.

ముఖ్యంగా హరికథాగానంలో కూడా వావమామలై వరదాచార్యులు ప్రావీణ్యాన్ని సంపాదించారు. ‘పోతన చరిత్ర’ను రచించి అభినవ పోతనగా గుర్తింపు పొందిన వానమామలై వరదాచార్యులు తెలంగాణ సాహితీరంగంపై తనదైన ముద్ర వేశారు. వరదాచార్యుల సహజ పాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులుగా నియమించారు.

అనంతరం ఆయన ఆంధ్ర సారస్వత పరిషత్తు నుంచి ‘విశారద’ పట్టా పొందారు. ఈ క్రమంలో పదమూడేండ్లు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1972లో వరదాచార్యులు ఉద్యోగ విరమణ పొందారు. 1972లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు ద్వారా శాసనమండలికి కూడా నామినేట్ అయ్యారు. 1950లలో క్షయవ్యాధికి గురైన వానమామలై ఊపిరితిత్తులకు పలుసార్లు శస్త్రచికిత్స చేయించకున్నారు.

అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో, ఒక ఊపిరితిత్తి తీసివేయాల్సి వచ్చింది. సుదీర్ఘ కాలం ఒక ఊపిరితిత్తితోనే ఉండి 1984, అక్టోబర్ 31న వానమామలై వరదాచార్యులు మరణించారు. చిన్న వయసులోనే రచనలు ప్రారంభించిన వానమామలై మొత్తం 60కి పైగా కీలకమైన గ్రంథాలు రచించారు. వాటిలో ‘పోతన చరిత్రము’, ‘వైశాలిని’, ‘జయధ్వజము’, ‘దాగుడుమూతలు’, ‘మాతృప్రేమ’, ‘రైతుబిడ్డ’ ఎంతో ప్రాచుర్యం పొందాయి.

1968లో ‘పోతన చరిత్రము’ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం, 1973లో కరీంనగర్ జిల్లా కోరుట్లలో భారతీ సాహిత్య సమితి వారి ద్వారా వానమామలై వరదాచార్యులుకు స్వర్ణ కంకణం అందజేయడంతోపాటు రత్నాభిషేకం జరిగాయి. 1976లో సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి వారి ద్వారా ఆయనకు ‘డి.లిట్’ గౌరవ పట్టా లభించింది.

వరదాచార్యులు జన్మించింది మడికొండలోనే అయినా వివాహానంతరం వారి నివాసం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరుకు మారింది. ఆయనకు ఎనిమిదవ ఏట ఉపనయన సంస్కారంతో పాటు శ్రీరామ తారక మంత్రోపదేశం జరిగింది. బాల్య గురువైన కాళోజీ రంగారావు శ్రీరామ తారకమంత్రం ఉపదేశించగా, మంథనివాసి, మేనమామ అయిన తిరువంగం గోపాలాచార్యులు వరదాచార్యులకు 13వ యేట వాగీశ్వరీ మహా మంత్రోపదేశం చేశారు.

అయితే, వరదాచార్యులు చెన్నూరులో శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారు. 1944లో ‘పోతన చరిత్ర’తో తన రచనల ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తగిన వైద్యం పొందలేకపోయిన ఆయనను పీవీ నరసింహారావు ఆదుకున్నారు. బహుభాషా కోవిదులైన వరదాచార్యులును నాటి తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘అభినవ పోతన’ బిరుదు ఇచ్చి ఘనంగా సన్మానించారు.

విద్యార్హతలు లేని వరదాచార్యులు కుటుంబ పోషణ నిమిత్తం స్వీయరచన అయిన ‘మణిమాల’యే పాఠ్యాంశంగా పరీక్షలు రాయడం విశేషం. ఆంధ్రా సారస్వతులుగా ఉత్తీర్ణులు కావడంతో ఉద్యోగానికి అర్హత లభించింది. బదిలీలో భాగంగా 1961లో చెన్నూరులో పాదం మోపిన ఆయన పదేండ్ల పాటు అక్కడే ఉన్నారు.

వృత్తి ఉపాధ్యాయునిగా, ప్రవృత్తి రచయితగా కొనసాగుతూ రచనాసేద్యం చేసిన వానమామలై ఎంతో మంది రచయితలకు ఆదర్శప్రాయులు. ముఖ్యంగా నేటి తరానికి చెందిన సాహితీవేత్తలు వరదాచార్యులను స్ఫూర్తిగా తీసుకుని సమాజహితం కోసం మరెన్నో రచనలు చేయాలి. 

కామిడి సతీష్‌రెడ్డి

 వ్యాసకర్త సెల్: 9848445134