భయాందోళనలో హిందువులు
- బంగ్లాదేశ్ వ్యాప్తంగా 200 దాడులు
- అల్లర్లలో ఐదుగురు మృతి
- అవకాశంగా తీసుకుని ఉగ్రదాడులు
న్యూఢిల్లీ, ఆగస్టు 13: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పతనం తర్వాత కూడా గందరగోళం నెలకొంది. మైనారిటీలైన హిందువులపై వరు స దాడులు జరుగుతున్నాయి. 3 రోజుల్లో 200కు పైగా దాడులు జరగగా ఐదుగురు మరణించారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో బంగ్లాలో పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడులకు సంబం ధించి రాజకీయ బాధితులతో పాటు రాజకీయేతర వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మైనారిటీలైన హిందువులు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు పలు వార్తా కథనా లు వెల్లడిస్తున్నాయి.
హసీనా పారిపోయిన నాటి నుంచి
బంగ్లాదేశ్‌లో తీవ్ర నిరసనల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయినా ఆందోళనకారులు శాంతించలేదు. మరోవైపు కొన్ని శక్తులు హిందువులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మైనారిటీలపై దాడులకు దిగుతున్నారు. ఇందులో లైంగిక వేధింపుల కేసులు సైతం ఉన్నాయి. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులు సాఫ్ట్ టార్గెట్‌గా మారార ని విశ్లేషకులు చెబుతున్నారు.
బంగ్లాలో పరిస్థితులను గమనిస్తే నిందితులను చట్టం పరిధి లోకి తీసుకురావడం కష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనా.. ఆందోళనలు, హింసాత్మక ఘటనలను అదు పు చేసే పరిస్థితి కనిపించడం లేదు. అనేక జిల్లాల్లో తీవ్ర ఆగ్రహంతో ఉన్న గుంపులు పోలీసులను సైతం వ్యతిరేకిస్తున్నారు. వారిపై దాడులకు దిగుతున్నారు. దీంతో హిందువులపై ద్వేషం పెంచుకున్న కొన్ని గ్రూపులు మైనారిటీలే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. ఈ పరిస్థితులు వారికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అవకాశంగా తీసుకుని..
బంగ్లాదేశ్‌లో మతపరమైన భావాలు ఎప్పటినుంచో ఉన్నాయి. మైనారిటీలు ముఖ్య ంగా హిందువులపై దాడి చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు, సంస్థ లు ఇక్కడ ఉన్నాయి. అవామీ లీగ్ హయాంలోనూ హిందువులపై దాడులు జరిగాయి. మతతత్వం అనేది బంగ్లాదేశ్ సమాజంలో కఠినమైన వాస్తవం అని బంగ్లా రచయిత, సామాజిక కార్యకర్త అనుపమ్ దేబాశిష్‌రాయ్ పేర్కొన్నారు. హసీనా రాజీనామా వరకు జరిగిన ఘటనలను పరిశీలిస్తే అవామీ లీగ్, పోలీసులు లక్ష్యంగా దాడి చేసినట్లు అర్థమవుతుంది.
కానీ ఇదే సమయంలో దేవాలయా లపై దాడులు, హిందువుల దుకాణాలను ధ్వంసం చేయడం, వారి ఆస్తులను లూటీ చేయడం వంటి హింసాత్మక ఘటనలతో పాటు ముఖ్య ంగా ఇవన్నీ మతప్రాతిపదికన జరిగినట్లు అర్థమవుతోంది. హత్యకు గురైన ఐదుగురిలో ముగ్గురికీ రాజకీయాలు, పోలీసులతో ఎలాం టి సంబంధం లేదని తెలుస్తోంది. రాఖల్‌గచ్చిలో టీచర్ మృణాల్ కాంతిచక్రవర్తిని నరికి చంపారు. ఆయన భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. అధికారికంగా 200 మందిపై దాడులు జరిగనట్లు చెబుతున్నా.. ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.
హక్కులు అందరికీ ఒకటే..
మైనారిటీలపై జరుగుతున్న దాడులపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ స్పందించారు. ప్రజలందిరికీ హక్కు సమానమేనని, ప్రతి ఒక్కరూ ఓపికగా ఉండాలని సూచించారు. బంగ్లాదేశ్ పూజ ఉజ్జపన్, మహానగర్ పూజా కమిటీలతో ఆయన భేటీ అయ్యారు.
హసీనాపై హత్య కేసు
దేశం విడిచి పారిపోయి భారత్‌కు చేరుకున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. ఆమెతో పాటు మరో ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఉద్యమంలో 550కి పైగా మర ణించారు. ఇందులో ఓ కిరాణ దుకాణ యజమాని అబుసయ్యద్ మరణించాడు. అతని మరణానికి కారణం హసీనానేననిఅతని కుటుంబసభ్యుల్లో ఒకరు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆమెతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. నిందితుల్లో అవామీ పార్టీ నేత, జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్, మాజీ ఐజీ అబ్దుల్లా అల్ మామున్ సహా మరికొందరు ఉన్నారు. కాగా, రిజర్వేషన్లకు ప్రాధాన్యమివ్వకుండా మెరిట్ విద్యార్థులకు అవకాశమివ్వాలని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చెలరేగాయి. ఇది ప్రధాని హసీనా రాజీనామాకు దారి తీసింది.




