సామాజిక న్యాయమే ఎజెండా
అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెడతాం
స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశంలోని ప్రజలందరికి సామాజిక న్యాయమే ఎజెండాగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి మోదీ సర్కారు ఎన్నో భిన్నమైన పథకాలను చేపట్టిందని చెప్పారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి బుధవారం సందేశమిచ్చారు. రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరమైన ప్రగతి ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు.
మన సామాజిక జీవనంలోని ప్రతి పార్శంలో సమ్మిలిత భావనను పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగటం గర్వంగా ఉందని తెలిపారు. త్వరలోనే మొదటి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టడమే లక్ష్యమని స్పష్టంచేశారు. నిత్య శ్రమతో అన్నదాత దేశప్రజల ఆకలి తీరుస్తున్నాడని రైతుల సేవలను కొనియాడారు. మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించారు.




