4 March, 2026 | 2:26 AM

జిల్లాలో ఘనంగా హోలీ వేడుకలు

04-03-2026 12:42 AM

జిల్లా కేంద్రంలో రంగులు చల్లుకుంటూ ఆనందంతో ఉత్సవాలు జరుపుకొన్న యువకులు ప్రజలు 

హోలీ వేడుకలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే 

కామారెడ్డి, మార్చి 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మంగళవారం హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు మొదలుకొని మహిళలు, యువకులు, ఒకరిపై ఒకరు రంగులు జల్లు కుంటూ ఆనంద ఉత్సవాలు జరుపుకున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సైతం రంగోలి వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకున్నారు.

కామారెడ్డి లో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, యువజన సంఘాలు, ఆర్యవైశ్య మహాసభ, ముదిరాజ్, పద్మశాలి సంఘాల ప్రతినిధులు, వివిధ సిండికేట్లకు సంబంధించిన వారు రంగులతో హోలీ వేడుకలను జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రంగుల హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఏలాంటి అవాంఛనీయ సంగతులు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి రించుకున్నారు. ప్రజా ప్రతినిధులు స్థానిక సర్పంచులు సైతం హోలీ వేడుకల్లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

తాడ్వాయిలో.. 

తాడ్వాయి, మార్చి 3 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో మంగళవారం హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్వాయి మండల కేంద్రం తోపాటు మండలంలోని ఎర్ర పహాడ్, దేమికలాన్,నందివాడ,ఏండ్రియాల్,చిట్యాల, కృష్ణాజివాడి, బ్రాహ్మణపల్లి, కన్కల్, చందాపూర్, సంగోజివాడి, బ్రహ్మాజీ వాడి గ్రామాల్లో హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. యువకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యువకులు యువతులు, నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ వేడుకలు నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోలీ సంబరాలు జరుపుకున్నారు.

గాంధారి మండలంలో.. 

గాంధారి , మార్చి 3 ( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం రాత్రి కాముని దహనం, మంగళవారం నాడు హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. హోలీ పండుగను పురస్కరించుకొని గ్రామాల్లోని యువత ఆనందోత్సాహాల మధ్య రంగులు చల్లుకుంటూ, గ్రామంలోని వీధుల గుండా తిరుగుతూ నృత్యాలు చేస్తూ పండగ సంబరాలు జరుపుకున్నారు. ప్రతీ సంవత్సరం లాగే సాయంత్రం స్థానిక దత్తాత్రేయ ఆలయం వద్ద కోలాటం ఆడుతూ జడకొప్పు వేయడం ఆద్యంతం అందరిని అలరించింది. నేడు వేసిన జాడకొప్పు మళ్ళీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది నాడు విప్పడం ఆనవాయితీ అని గ్రామ పెద్దలు తెలిపారు. తరాలు మారిన తమ గ్రామ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని వారు అన్నారు.

బాన్సువాడలో..

బాన్సువాడ, మార్చి 3 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని ఆయా మండలాలు చందూర్ మోస్రా పొతంగల్ కోటగిరి రుద్రూర్ వర్ని నస్రుల్లాబాద్ బీర్కూర్ బాన్సువాడ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.  ప్రతియేటా ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షం పౌర్ణమి తిథి రోజు ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ వేడుకలను నిర్వహిస్తారు.   కులమత బేధాలు లేకుండా జరుపుకునే ఈ హోలీ పండుగ వసంతకాలపు రాకను, ప్రేమ, ఐక్యత, సంతోషం, పాత గొడవలను మరచి కొత్త బంధాలను ఏర్పరచుకోవడాన్ని సూచిస్తుంది. నియోజకవర్గంలోని నాయకులు చిన్నారులు మహిళలు యువకులు యువకులు, పెద్దలు పాల్గొన్నారు.

అభ్యాస పాఠశాలలో..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అభ్యాస పాఠశాలలో హోలీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలోని చిన్నారులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రావణ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఒకరికొకరు చిన్నారులు విద్యార్థులు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ సంబరంగా జరుపుకున్నారు. ఉపాధ్యాయులు సైతం చిన్నారులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు చిన్నారులు పాల్గొన్నారు.