31-08-2025 01:05:43 AM
బండి సంపత్ కుమార్, మహబూబాబాద్ (విజయక్రాంతి);సెల్‌ఫోన్ వినియోగం కూడా సరిగా తెలియని మారుమూల గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలైన మహిళలు ‘నమో దీదీ డ్రోన్’ పథకం ద్వారా సొంతంగా డ్రోన్ పొందడంతోపాటు, శాస్త్రీయంగా శిక్షణ పొంది ఏడాదికి నికరంగా 50 వేల ఆదాయాన్ని పొందుతూ ఔరా అనిపిస్తున్నారు. కనీసం ఊహకు కూడా అందని వారి ఆశలు ఇప్పుడు ఏకంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్రామీణ వ్యవసాయ కూలీలైన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ల పూసపల్లి, కల్వల గ్రామాలకు చెందిన కుంట అమృత, మమత ఆత్మస్థైర్యంతో ఇప్పుడు డ్రోన్ ఆపరేట్ చేస్తూ ముందుకు సాగుతున్న తీరుపై విజయక్రాంతి కథనం.
మహిళా సంఘాల్లోని పేదలను నమో డ్రోన్ దీదీ పథకం కింద 80 రాయితీతో డ్రోన్లను పంపిణీ చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లికి చెందిన అభ్యుదయ రైతు సొల్లేటి జైపాల్ రెడ్డి డ్రోన్ దీదీ పథకాన్ని తమ ప్రాంతంలోని వారికి ఇప్పించేందుకు కృషి చేశారు. ఇందులో భాగంగా తాళ్లపూసపల్లికి చెందిన కుంట అమృత, కలువలకు చెందిన గుర్రాల మమతలను ఎంపిక చేసి వారికి డ్రోన్ ఆపరేటింగ్‌లో శిక్షణ ఇప్పించారు.
అనంతరం ఇద్దరికీ నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా చెరో డ్రోన్ వచ్చేలా చేశారు. గతేడాది అమృత, మమత తమ గ్రామాలతో పాటు పరిసర గ్రామాల్లో డ్రోన్ ద్వారా పంటలపై పురుగు మందులు, ఎరువుల పిచికారీ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ సహకారంతో రైతులకు డ్రోన్ వినియోగం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ, పురుగుమందు, ఎరువుల వినియోగాన్ని డ్రోన్ ద్వారా చేపట్టడం వల్ల సమయం ఆదా, పంటల్లో చీడపీడల నివారణకు ఎలా కృషి చేస్తుందని విషయాన్ని వివరిస్తున్నారు. ఫలితంగా రోజుకు 150 నుంచి 200 రూపాయల కూలీ డబ్బులకు బదులు ఇప్పుడు నికరంగా ఏడాదికి రూ.50 వేల పైనే ఆదాయాన్ని సమకూర్చుకుంటూ, కూలి బదులు డ్రోన్ పైలట్‌గా సమాజంలో గుర్తింపు పొందుతున్నారు.
గౌరవంగా జీవిస్తున్నాం
వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ఆశించిన ఆదాయం లభించే ది కాదు. పని ఉన్నప్పుడు మాత్రమే ఆదాయం వచ్చేది. అది కూడా రోజువారి ఇంటి ఖర్చులకు కూడా సరిపో యేది కాదు. నమో డ్రోన్ దీదీ పథకం లో పొందిన డ్రోన్ వల్ల నికర ఆదా యం లభిస్తోంది. రోజుకు ఒక్కోసారి రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు ఆదాయం వస్తోంది. గతేడాది 50 వేలకు పైగా నికర ఆదాయం లభించింది. ఈ ఏడాది డ్రోన్ వినియోగం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం. దీంతో ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. గౌరవానికి గౌరవం, ఆదాయానికి ఆదాయం లభిస్తుండటం సంతోషాన్ని కలిగిస్తుంది.
కుంట అమృత, డ్రోన్ పైలెట్
నమ్మకం పెరిగింది..
శాస్త్ర సాంకేతిక రంగంలో పురుషులే ఆధిపత్యం చలాయిస్తుండగా, డ్రోన్ ఎగరవేయడం మాకు సాధ్యమయ్యే పనేనా అని మొదట్లో అనుమానం పట్టిపీడించేది. అయితే శిక్షణ పొందిన తరువాత మేం కూడా ఎలాంటి పనైనా చేయగలమన్న నమ్మకం పెరిగింది. ఇప్పుడు మమ్మల్ని గౌరవప్రదమైన ‘డ్రోన్ పైలెట్’ గా పిలుస్తుండటం వల్ల ఎంతో గర్వంగా ఉంది. ‘నమో డ్రోన్ దీదీ’తో ఆదాయానికి తోడు సమాజంలో గౌరవం లభించింది.
గుర్రం మమత, డ్రోన్ పైలెట్