31-08-2025 01:08:32 AM
విజయక్రాంతి ;స్వచ్ఛమైన సెలయేళ్లు.. దట్టమైన అడవులు.. విస్తారమైన కొండలు.. పక్షుల కిలకిల రావాలు.. పచ్చని ప్రకృతి అందాలకు నెలవు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా.. సజీవ సాక్ష్యంగా అమాయక గిరిజనులు ఇక్కడ ఇప్పటికీ జీవనం సాగిస్తున్నారు. ఆహారపు అలవాట్లు, పెళ్లిళ్లు.. పుట్టక.. చావు.. పండగలు.. పూజించే దేవతలు.. ఆదివాసీలకు ప్రత్యేకం. వాళ్ల సంస్కతి, సంప్రదాయాలు.. కళలు, కట్టుబాట్లు, ఆచారాలు.. విశ్వ మానవుల నాగరికత సంతతికి చిరునామాలు. అలాంటి ఏజెన్సీ ప్రాంతంలో ప్రకృతి సౌందర్యాలను, వెన్నెల హొయలతో పర్యాటకుల మనసు దోచుకుంటున్న వెన్నెల జలపాతంపై విజయక్రాంతి ప్రత్యేక కథనం.
మణుగూరు మండలంలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో రథంగుట్ట వద్ద వెన్నెల జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ కుటుంబసభ్యులతో ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. వెన్నెల జల పాతాన్ని చూసి ప్రకృతి పరవశంతో పులకించి పోతున్నారు. ర థంగుట్ట నుంచి 50 అడుగుల ఎత్తులో స్వచ్ఛమైన తెల్లని నీటి ధారలా జలపాతం జాలు వారుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడే ఈ జలపాత అందాలను తమ కెమెరాల్లో బంధించాలని ఎంతోమం ది పర్యటకులు ప్రయత్నిస్తున్నారు. స్పందించే మనసుండాలేగానీ ఈ జలపాతం అందాలు మాటలకందని ఆహ్లాదాన్ని అందిస్తున్నా యి. వర్షాకాలంలో జలపాతం నయాగరా జలపాతాన్ని తలపిస్తోంది. దట్టమైన అటవీ మధ్యలో నుంచి ఈ జలపాతాన్ని చూ సేందుకు వెళ్లే సౌకర్యం ఉంది. చల్లటి వాతావరణం, పర్యాటకుల్ని కనువిందు చేసే మనోహరమైన పచ్చదనం, ఉవ్వెత్తున ఎగిసిపడే వెన్నెల జలపాతం మనోహరంగా కనిపిస్తోంది. వర్షాకాలం కావడంతో జలపాతం అందాలు మరింత రెట్టింపయ్యాయి.
పాలధారై మదిని దోచే పరవళ్లు..
రథంగుట్టపై నుంచి పాలధారై జాలువారుతున్న జలధారలు.. షవర్‌ను తలపించే నీటి తుంపరలు, చూసేకొద్దీ చూడాలనిపించే జలసవ్వడులు, మదిని దోచే జలపాతం పరవళ్లు, తనివితీరని దృ శ్యాలతో వెన్నెల జలపాతం కనువిందు చేస్తోంది. ఏజెన్సీలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతం సవ్వడి కనువిందు చేస్తోంది. ఆకుపచ్చని కొండలు, దట్టంగా అలుముకున్న పొగమంచు, సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ జలపాతాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్దఎత్తున తరలిరావడంతో ఆది వారం, సెలవుదినాల్లోఈ ప్రాంతం జన జాతరను తలపిస్తోంది.
కనువిందు చేస్తున్న అందాలు..
ప్రకృతి నడుమ ఉన్న ఈ జలపాతం ఎన్నో ఏళ్లుగా నిరాధారణకు గురైంది. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేశారు. గుట్టపై నుంచి ప్రవహించే పాల నురుగు లాంటి జలపాతానికి ఎంతో ప్రత్యేకత ఉం ది. సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అటవీ శాఖ సౌకర్యాలు కల్పించింది. రథంగుట్ట వద్ద అర్బన్ పార్క్, పార్కులో జపాన్, కేరళ కుటీరాలను నిర్మించారు. జలపాతం వరకు రోడ్ణు ఏర్పాటు చేశారు. పలుచోట్ల విశ్రాంతి కోసం ఏర్పాట్లు ఉన్నాయి.
సౌకర్యాలు మెరుగుపరచాలి..
వాటర్ ఫాల్ నిర్వహకులు పర్యాటకుల నుంచి చార్జీలు వ సూలు చేస్తున్నప్పటికీ.. సరైన సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదన్న ఆరోపణలున్నాయి. సుదూరం నుంచి వచ్చే పర్యాటకులకు చార్జీలను మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నా రు. ఈ జలపాతాన్ని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటక రంగంతో పాటు భద్రాద్రి జిల్లా కూడా మరింత పేరు సంపాదించుకుంటుందని పర్యాటకులు కోరుతున్నారు.
ప్రకృతి అందాలను ఆస్వాదించిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఇటీవల వెన్నెల జలపాతాన్ని సందర్శించారు. ఇక్కడ ప్రకృతిలోని జలపాత అందాలను ఆస్వాదించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అద్భుతమైన ప్రదేశాన్ని చూసిన అనుభూతి కలిగిందన్నారు. విహార యాత్రల కోసం వేరే రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, స్వచ్ఛమైన ప్రకృతి అందాలతో అటవీ ప్రాంతంలోని వెన్నెల జలపా తం ఒక అద్భుత విహారయాత్ర అభి వర్ణించారు. చక్కటి వాతావరణంతో పాటు కల్మశం లేని ఆదివాసులను చూసి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.