calender_icon.png 31 August, 2025 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కేంద్రంలో చోరీ

31-08-2025 01:19:52 PM

30 తులాల బంగారం అపహరణ..

తాళం వేసిన ఇల్లే టార్గెట్ చేసిన దొంగలు..

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని రాజంపేట కాలనీలో తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసి ఇంట్లో చొరబడి 30 తులాల బంగారం, 50 వేల రూపాయలకు పైగా నగదును దోచుకెళ్లిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. రాజంపేట లోని నివాసముంటున్న బీరెల్లి సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి కి మొక్కలు చెల్లించేందుకు శనివారం బయలుదేరారు. ఇంటికి తాళం వేసి ఉన్నది గమనించిన దుండగులు రాత్రి సమయంలో చొరబడి బంగారం, నగదు దోచుకోవడం తోపాటు ఇంట్లోనే సామాగ్రిని చిందరవందర చేశారు.

ఆదివారం ఉదయం దేవదర్శనానికి వెళ్లి వచ్చిన సురేష్ కుటుంబ సభ్యులు ఇంటి వద్దకి వచ్చి చూసేసరికి గేట్లు తెరిచి ఉండడంతో పాటు ఇంటి తాళం పగలగొట్టి ఉంది. గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి సామాగ్రి పూర్తిగా చిందరవందరగా ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఉదయ్ కిరణ్ ,డాగ్ స్క్వాడ్ తో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వివరాలు సేకరించిన ఎస్సై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పనిచేయని సీసీ కెమెరాలు..

జిల్లా కేంద్రంలోని రాజంపేటలో నివాసముంటున్న సురేష్ నివాసంలో చోరీ జరిగిన సంఘటన నేపథ్యంలో పోలీసులు సిసి టీవీ ఫుటేజీని పరిశీలించేందుకు వెళ్లగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన పోలీసు ఉన్నతాధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో నిఘా నేత్రాలు దర్శన ప్రయంగా మిగిలిపోతున్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం సీసీ కెమెరాల ఆవశ్యకత తెలుస్తుంది. నిఘా నేత్రాలు పనిచేయకపోవడంతో పోలీసులు ఇతర మార్గాలను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సీసీ కెమెరాలు పనితీరును మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.