calender_icon.png 31 August, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలజ్ కర్ర గణేశుడికి 78 ఏళ్లు

31-08-2025 01:03:42 AM

జీవకళలకు నిలయమైన నిర్మల్ కొయ్యబొమ్మల తయారీ కేంద్రంలో 78 ఏళ్ల కిందట కళాకారుడు గుండాజి చెక్కిన అపురూప గణేశ్ విగ్రహం అక్కడ నేటికీ పూజలందుకుంటోంది. స్వాతంత్య్ర దినోత్సవ తొలినాళ్లలో ఏటా గణేశ్ ఉత్సవాలను జరుపుకొని జాతి ఐక్యతను చాటాలని బాలగంగాధర్ ఇచ్చిన పిలుపుమేరకు నిర్మల్ జిల్లా సరిహద్దు గ్రామమైన మహారాష్ట్రలోని పాలజ్‌లో నిర్మల్ కళాకారుడు గుండాజి 1947లో ఈ అపురూప గణేశ్ విగ్రహాన్ని చెక్కారు. ఒకే కర్రతో నెలరోజుల పాటు కష్టపడి రూపొందించిన ఈ కర్ర వినాయకుడిని అక్కడ ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. గణేశ్ ప్రతిష్టాపన తర్వాత ఆ గ్రామంలోని ప్రజలకు సుఖశాంతులు కలగాయని చెబుతారు.

 నిర్మల్/ కుబీర్ (విజయక్రాంతి); నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ సరిహద్దు గ్రామమైన పాలసీకి రెండు కిలోమీటర్ల దూరంలో పాలజి గ్రామం ఉంది. ఇక్కడ సుమారు 1,500 కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నా యి. పాలజ్ మహారాష్ట్రలో ఉన్నప్పటికీ సరిహద్దు గ్రా మం కావడంతో సగం మంది మరాఠీ, సగం మంది తెలుగు మాట్లాడుతారు. నిర్మల్ జిల్లాలోని వివిధ గ్రా మాల ప్రజలకు ఇక్కడి వారితో బంధుత్వాలు ఉన్నాయి. అందుకే ఈ ఉత్సవాలకు మహారాష్ట్రతో పాటు నిర్మల్ జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు. పాలజ్‌లో 78 ఏండ్ల కిందట నిర్మల్ కళాకారుడు గుండాజీ ప్రతిష్ఠించిన కర్ర గణేశుడికి ఇక్కడ ఏటా 11 రోజుల పా టు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

గణేశుడిని దర్శించుకొనేందుకు వచ్చిన భక్తులకు అన్నదానం, వివిధ సేవా కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వహిస్తారు. మహారాష్ట్రలోని ముంబై, ఔరంగాబాద్, నాగపూర్, అకోలా, పర్బనీ, లాతూర్, అమరావతి, నాందేడ్, కర్ణాటకలోని బీదర్ ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాలనుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. సంతానలేమితో బాధపడుతున్న వారు ఇతర సమస్యలు ఉన్నవారు కర్ర వినా యకుడిన్ని దర్శించుకొని పూజలు చేసి కొబ్బరికాయ, బియ్యంతో ఇక్కడ ముడుపు కడితే వారి కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. పాలజీ గ్రామానికి 30 కిలోమీ టర్ల దూరంలో ఉన్న గ్రామాల వారు 11 రోజులపాటు ఉపవాసం ఉండి ఖాళీ కడుపుతో నడుచుకుంటూ వెళ్లి కర్ర గణేశుడిని దర్శించుకుంటారు. 11 రోజుల పాటు జరిగే గణేశ్ ఉత్సవాలకు దాదపు 50 వేల నుంచి 60 వేల మంది భక్తులు పాలాజ్ వినాయకుని దర్శించుకుంటారు.

మెరుగుపడిన సౌకర్యాలు

మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన పాలజిలో కొలువైన కర్ర వినాయకుడి దర్శనానికి భక్తుల తాకిడి పెరగడంతో మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు గ్రామానికి ఆయా సదుపాయాలు కల్పించింది. భైంసా బలిసి మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రహదారిని సింగల్ లైన్ రోడ్ నుంచి డబ్బులు రోడ్ లైన్‌గా మార్చారు. బైం సా డిపో నుంచి ప్రతిరోజు బస్సులను ఏర్పాటు చేయగా, గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో 50 ప్రత్యేక ట్రిప్పులను నడుపుతున్నారు. మహారాష్ట్రలోని భోకర్, నాందేడ్, కిన్వట్ నుంచి మహారాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు కూడా నడుపుతున్నారు. బోకర్ నుంచి పలసి వరకు 30 కిలోమీటర్లు ఉన్న సింగిల్ లైన్ రోడ్డును డబుల్ లైన్ సీసీ రోడ్డుగా మార్చారు.

గ్రామంలో పదివేల మందికి భోజనం చేసే అన్న సత్రం, ఆలయం వద్ద భక్తుల దర్శనానికి ఉపయోగించే మండపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినందుకు ఆడిటోరియం, ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు, పార్కింగ్, మరుగుదొడ్లు, మూత్రశాలలను ఏర్పాటు చేశారు. భక్తులకు 11 రోజులపాటు ఉచిత అన్న ప్రసాదాన్ని అందిస్తారు. గ్రామానికి చెందిన 200 మంది మహిళలు ఈ వంటకాలను తయారుచేసి భక్తులకు వడ్డించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్‌ముఖ్ సతీమణి తెలంగాణలోని కుబీర్ మండలం పాలసీకి చెందిన అమ్మాయి కావడం, ఈ గ్రామం పాలజీ గ్రామానికి సరిహద్దులో ఉండటం విశేషం.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు ఈ గ్రామానికి వచ్చిన విలాస్‌రావు దేశ్‌ముఖ్ పాలజ్ కర్ర వినాయకున్ని దర్శించుకొని సదుపాయాల కల్పనకు భారీగా నిధులు మంజూరు చేశారు. గ్రామస్తులు కూడా ఐక్యతతో చందాలు వేసుకొని ఆలయ అభివృద్ధికి ఖర్చు పెడుతున్నారు. పాలజ్‌కు వచ్చిన భక్తులకు గ్రామస్తులే వాలంటీర్లుగా మారి సేవలందిస్తున్నారు. ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి 11 రోజులపాటు పూజలు నిర్వహించిన అనంతరం చివరి రోజు ఊరేగింపు చేపడతారు. అదే మందిరంలో నీళ్లు, పాలతో శుద్ధి చేసి గణేశ్ కర్ర వినాయకున్ని భద్రంగా ఉంచుతారు. ఇప్పటికీ ఆ విగ్రహం చెక్కుచెదరకుండా ఉంది.

సాంస్కృతిక కార్యక్రమాల వేదిక

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు తరలి రావడంతో వారికి వినోదాన్ని అందించేందుకు 11 రోజుల పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలైన పాఠశాల విద్యార్థులతో వివిధ ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. గణపతి భజన, కర్ణాటక సంగీతం, మహారాష్ట్ర డోలు బాజా, గానకచేరి వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు. కళాకారులు సంప్రదాయ దుస్తులు ధరించి నాటికలు, డాన్సులు, భక్తి గీతాలు పాడుతూ రాత్రిబంవళ్లు వేడుకల్లో భక్తులను రంజింపజేస్తున్నారు. ప్రత్యేక ఛానల్‌ను ఏర్పాటు చేసి లైవ్‌ను అందిస్తారు. పాలజ్ గణేశ్ వద్ద తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు.