కొలనూరులో ఘోర అగ్నిప్రమాదం
కోనరావుపేట, మే 24 (విజయక్రాంతి): చేతికొచ్చిన పంట కళ్లముందే బూడిదైపోవడంతో ఓ రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో శనివారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన రైతు దుద్దేటి రాములుకు చెందిన మామిడి తోట పూర్తిగా అగ్నికి ఆహుతైంది.బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 30 సంవత్సరాలుగా ఎంతో శ్రమించి పెంచుకున్న పెద్ద మామిడి చెట్లు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. ప్రస్తుతం చెట్లన్నీ కాయలతో కళకళలాడుతున్న సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో దాదాపు 100 మామిడి చెట్లు కాయలతో సహా పూర్తిగా దగ్ధమయ్యాయి.
అగ్నిప్రమాద తీవ్రతకు తోటలోని మామిడి చెట్లతో పాటు వాటికి నీరందించే వాటర్ పైప్లైన్లు, డ్రిప్ పైపులు, మొత్తం డ్రిప్ సిస్టమ్ కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు రాములు కన్నీటిపర్యంతమయ్యారు.పొలాల్లో పంట కోతల అనంతరం కొందరు బాధ్యతారాహిత్యంగా కొయ్యలకు నిప్పు పెడుతున్నారు. ఆ మంటలు వ్యాపించి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి ఎవరూ కూడా చేలల్లో కొయ్యలు అంటబెట్టి మాలాంటి రైతుల జీవితాలను నాశనం చేయకండి అని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ప్రమాదానికి కారణమైన వారిపై అధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు డిమాండ్ చేశారు.






