ఘోర రోడ్డు ప్రమాదం నలుగురి దుర్మరణం
అదుపుతప్పి బావిలో పడిన కారు
మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు
సిద్దిపేట క్రైం, ఆగస్టు 20 (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు. దుబ్బాక మండలంలోని బల్వంతపూర్‌గ్రామానికి చెందిన దండుగుల రాజు (35), అతని భార్య భాగ్య( 22), కుమారుడు నియాన్స్(5), కూతురు శాన్విక(3) సిద్దిపేటలో బంధువు దశదినకర్మకు హాజరై తిరిగి వస్తుండగా..
అప్పన్నపల్లి శివారులో వేగం అదుపుతప్పి కారు బావిలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న దుబ్బాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, క్రేన్ సహాయంతో కారు, మృతదేహాలను బావిలో నుంచి వెలికితీయించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.






